న్యూఢిల్లీ: ఇండియా కూటమికి చెందిన నేతలు ఇవాళ ఢిల్లీలో మీటింగ్(INDIA Bloc Meeting) నిర్వహించారు. కానిస్టిట్యూషన్ క్లబ్లో ఆ నేతలు భేటీ అయ్యారు. ఇండియా బ్లాక్ పార్టీలకు చెందిన నేతలు అయిదు అంశాలపై ఓ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి రెండు నెలలకు ఒకసారి కలుసుకోవాలని తీర్మానించారు. ఇక కీలకమైన ఎజెండాలో భాగంగా.. భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయాలని కూటమి నేతలు అంగీకరించారు. స్పెషల్ ఇన్టెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) ద్వారా ఓట్ల లూటీ జరుగుతున్నట్లు సీజేఐకి చెప్పాలని నేతలు భావించారు. దీంతో పాటు ఇటీవల ప్రవేశ, ఉద్యోగ పరీక్షలకు చెందిన ప్రశ్నాపత్రాల లీకేజీ అంశంలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానించారు.
ఇవాళ జరిగిన మీటింగ్లో 23 పార్టీలకు చెందిన ప్రతిపక్ష నేతలు పాల్గొన్నారు. సర్ గురించి సీజేఐకి లేఖ రాయాలని అన్ని పార్టీలు ఏకగ్రీవంగా అంగీకరించాయి. ఓట్ల లూటీ జరుగుతోందని, ఎన్నికలను చోరీ చేస్తున్నారని పార్టీలు ఆరోపించాయి. త్వరలోనే సీజేఐకి లేఖను రాయనున్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని ఏకగీవ్రంగా నిర్ణయించారు. నీట్, సీబీఎస్ఈ పరీక్షలు రాసిన లక్షలాది మంది విద్యార్థులను ద్రోహం చేశారని నేతలు ఆరోపించారు.
ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, నిరుద్యోగం, ధరల పెరుగులద, రైతు సమస్యల గురించి చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే అఖిల పక్ష సమావేశం నిర్వహించాలని కోరారు. తదుపరి మీటింగ్ ఆగస్టులో హైదరాబాద్లో నిర్వహించనున్నారు.