పాట్నా: ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్ లీడర్‌ను ఏకాభిప్రాయం ద్వారా ఎన్నుకుంటామని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) తెలిపారు. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీతో సహా కూటమికి చెందిన ఏ సీనియర్ నాయకుడైనా నాయకత్వం వహించడం పట్ల తనకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు. పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ నేపథ్యంలో ‘ఇండియా’ బ్లాక్ కూటమికి కాంగ్రెస్ నాయకత్వంపై పలు ప్రాంతీయ పార్టీలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. కూటమిని లీడ్ చేసేందుకు కొత్త సారథి కావాలని ఆశిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో తేజస్వీ యాదవ్ మీడియాతో మాట్లాడారు. ‘కూటమికి మమతా బెనర్జీ నాయకత్వం వహించడంలో మాకు ఎలాంటి సమస్య లేదు. కానీ బీజేపీ వ్యతిరేక కూటమిలో చాలా మంది సీనియర్ రాజకీయ నాయకులున్నారన్నది గుర్తించుకోవాలి. కూటమి నేతను ఎన్నుకోవడంపై కలిసి కూర్చుని సమిష్టి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే అన్ని పార్టీల ఏకాభిప్రాయం ద్వారానే ఇది జరుగుతుంది’ అని అన్నారు.
మరోవైపు ‘ఇండియా’ కూటమికి నేతృత్వం వహించడంపై టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఆసక్తి చూపారు. బెంగాల్ సీఎం పదవిని నిర్వహిస్తూనే ‘ఇండియా’ బ్లాక్ బాధ్యతలను కూడా చేపట్టగలనని అన్నారు. ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ కూడా దీనికి మద్దతిచ్చారు. మమతా బెనర్జీ సమర్థురాలని, ‘ఇండియా’ బ్లాక్‌కు నేతృత్వం వహించే హక్కు ఆమెకు ఉందని అన్నారు.