ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) ఘోర ఓటమిపై ఆ పార్టీలు నిందించుకుంటున్నాయి. (blame game) ఇండియా కూటమిలోని మిత్రపక్షాలు ఒకరికొకరు సహకరించుకోలేదని కర్ణాటక హోం మంత్రి, కాంగ్రెస్ ఎన్నికల ఇంచార్జ్ జీ పరమేశ్వర్ ఆరోపించారు. ఇబ్బందికరమైన ఓటమికి కారణం కూటమి భాగస్వాముల మధ్య సహకారం, సమన్వయం లేకపోవడమేనని విమర్శించారు.
కాగా, పలు నియోజకవర్గాల్లో శివసేన (యూబీటీ)కి కాంగ్రెస్ పూర్తిగా మద్దతివ్వలేదని పరమేశ్వర్ తెలిపారు. ఉద్ధవ్ ఠాక్రే పార్టీ కూడా అదే విధంగా వ్యవహరించిందని, శరద్ పవార్ ఎన్సీపీ వర్గం కూడా తమ సహకారం ఇవ్వలేదన్నది స్పష్టంగా కనిపించిందని అన్నారు.
మరోవైపు దేశంలో ఈవీఎంలు ఉన్నంత వరకు కాంగ్రెస్ లేదా మరేదైనా పార్టీ అధికారంలోకి రావడం చాలా కష్టమని పరమేశ్వర్ తెలిపారు. ఈవీఎంలను హ్యాకింగ్ చేయడంలో వారు (బీజేపీ) నిపుణులని ఆరోపించారు. ఎక్కడ కావాలంటే అక్కడ ఎన్నికల ఫలితాలను వారు తారుమారు చేయగలరని విమర్శించారు.