న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీ ప్రభుత్వం ఛత్రసాల్ స్టేడియంలో నిర్వహించే వేడుకలో ఢిల్లీ హోంమంత్రి కైలాశ్ గెహ్లాట్ జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. సీఎం కేజ్రీవాల్ తీహార్ జైలులో ఉండటంతో కైలాశ్ పేరును ఎల్జీ వీకే సక్సేనా నామినేట్ చేశారు. కాగా, ఎవరు జెండా ఎగురవేయాలనే అంశంపై ఆప్, ఢిల్లీ ఎల్జీ మధ్య పేచీ మొదలైంది. తన బదులు విద్యాశాఖ మంత్రి ఆతిశీని జెండా ఎగురవేసేందుకు అనుమతించాలని ఇటీవల ఎల్జీకి కేజ్రీవాల్ జైలు నుంచి లేఖ రాశారు.
అయితే, ఈ లేఖ సరైన సమాచార ప్రక్రియ కాదని పేర్కొంటూ కేజ్రీవాల్ విజ్ఞప్తిని సాధారణ పరిపాలన విభాగం పక్కన పెట్టింది. దీంతో హోంమంత్రి కైలాశ్ పేరును ఎల్జీ ప్రతిపాదించారు. జెండా ఎవరు ఎగురవేయాలనే దానికి సంబంధించి నిర్దిష్ట పద్ధతి ఉందని, ఇది పాటించకపోతే ఈ వేడుక పవిత్రత దెబ్బతింటుందని, అందుకే కైలాశ్ జెండా ఎగురవేస్తారని సాధారణ పరిపాలన విభాగం వివరించింది. గెహ్లాట్ ఎంపికను ఆప్ స్వాగతించింది. ‘ఎంపికైన’ వ్యక్తిని కాకుండా ‘ఎన్నికైన’ వ్యక్తిని నామినేట్ చేయడం ప్రజాస్వామ్యానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నది.