సత్నా: మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ రైతుకు జారీచేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నది. ఇందులో ఆ రైతు వార్షికాదాయాన్ని కేవలం మూడు రూపాయలుగా చూపించడంతో నెటిజన్లు అతడిని దేశంలోనే అత్యంత పేద రైతుగా అభివర్ణిస్తున్నారు.
ఈ విషయం కాస్తా అధికారుల దృష్టికి చేరడంతో అది ‘టెక్నికల్ ఎర్రర్’ అని వివరణ ఇచ్చారు. సత్నా జిల్లాలోని కోఠి తహసీల్‌లో ఉన్న నయాగామ్ గ్రామానికి చెందిన 45 ఏళ్ల రామ్‌స్వరూప్ పేరుమీద ఈ ఆదాయ ధ్రువీకరణ పత్రం జారీ అయింది. దీనిపై తహసీల్దార్ సౌరభ్ ద్వివేదీ సంతకం కూడా ఉంది. ఈ నెల 22న జారీ అయిన ఈ ఆదాయ ధ్రువీకరణ పత్రం ఫొటో సోషల్ మీడియాకెక్కి తెగ వైరల్ అవుతున్నది.