న్యూఢిల్లీ: హైదరాబాద్‌లోని భారత జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం(ఇన్కాయిస్) ప్రతిష్ఠాత్మక సుభాష్ చంద్రబోస్ ఆప్దా ప్రబంధన్ పురస్కార్-2025కు ఎంపికైంది. విపత్తుల నిర్వహణలో విశిష్ట సేవలు అందించినందుకు సంస్థల విభాగంలో ఈ అవార్డు ఇన్‌కాయిస్‌ను వరించింది. అవార్డు కింద రూ.51 లక్షల నగదు బహుమతితో పాటు ప్రశంస పత్రం అందిస్తారని కేంద్ర హోం శాఖ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.
విపత్తు నిర్వహణకు సంబంధించి అమూల్య, నిస్వార్థ సేవలు అందించిన సంస్థలు, వ్యక్తులకు ఏటా సుభాష్ చంద్రబోస్ ఆప్దా ప్రబంధన్ పురస్కార్‌ను అందిస్తారు. 1999లో హైదరాబాద్‌లో స్థాపించిన ఇన్కాయిస్ సముద్ర సంబంధిత విపత్తులపై ముందస్తు సమాచారాన్ని, హెచ్చరికలను జారీ చేస్తుంది. ఈ సంస్థలో ఉన్న సునామీ ముందస్తు హెచ్చరిక కేంద్రం పది నిమిషాల్లో సునామీ హెచ్చరికలను జారీ చేస్తుంది.
మన దేశంతో పాటు హిందూ మహా సముద్రం పరిధిలోని 28 దేశాలకు ఈ సేవలను అందిస్తున్నది. యునెస్కో ఈ సంస్థను సునామీ సేవలందించే అత్యుత్తమ కేంద్రంగా గుర్తించింది. సముద్రంలో గల్లంతైన వస్తువులు, వ్యక్తుల జాడను తెలుసుకోవడానికి భారత నౌకా దళ గస్తీ విభాగం కోసం శోధన, సహాయ ఉపకరణాన్ని(సరట్) ఇన్కాయిస్ రూపొందించింది.