భోపాల్: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశ పెట్టిన వందే భారత్ రైళ్లు (Vande Bharat), అందులో అందిస్తున్న ఆహారం నాణ్యతపై విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా వందే భారత్ రైలులో ప్రయాణించిన ఒక వ్యక్తి ఫుడ్ ఆర్డర్ చేశాడు. అయితే రోటీలో బొద్దింక ఉండటం చూసి అతడు షాక్ అయ్యాడు. రైల్వే అధికారులకు, ఐఆర్సీటీసీకి దీని గురించి ఫిర్యాదు చేశాడు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది. సుబోధ్ పహలాజన్ అనే వ్యక్తి ఈ నెల 24న భోపాల్ నుంచి గ్వాలియర్‌కు వందే భారత్ రైలులో ప్రయాణించాడు. ఈ సందర్భంగా ఫుడ్ ఆర్డర్ చేశాడు.
కాగా, ఐఆర్సీటీసీ క్యాటరింగ్ సిబ్బంది సర్వ్ చేసిన ఫుడ్ ప్యాక్‌ను సుబోధ్ తెరిచాడు. ఒక రోటీకి బొద్దింక అంటుకుని ఉండటం చూసి షాకయ్యాడు. వెంటనే మొబైల్ ఫోన్లో ఫొటోలు తీశాడు. వాటిని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. వందే భారత్ ట్రైన్లో ఆర్డర్ ఇచ్చిన ఫుడ్‌లో బొద్దింక కనిపించినట్టు అందులో పేర్కొన్నాడు. ఐఆర్సీటీసీ అధికారులకు దీనిని ట్యాగ్ చేశాడు. అలాగే వందే భారత్, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అని హ్యాష్‌ట్యాగ్‌లు ఇచ్చాడు.
మరోవైపు, సుబోధ్ ఫిర్యాదుపై ఐఆర్సీటీసీ అధికారులు స్పందించారు. భవిష్యత్తులో ఇలా జరుగకుండా చర్యలు తీసుకుంటామని బదులిచ్చారు. కాగా, వందే భారత్ ట్రైన్లో సర్వ్ చేసిన ఫుడ్‌లో బొద్దింక ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఎంతో ఖరీదైన ఆ రైలులో ప్రయాణం గురించి, అందులో అందించే ఆహారం నాణ్యత గురించి నెటిజన్లు మండిపడ్డారు. రైల్వే, ఐఆర్సీటీసీ తీరును విమర్శించారు.
@IRCTCofficial found a cockroach in my food, in the vande bharat train. #Vandebharatexpress#VandeBharat #rkmp #Delhi @drmbct pic.twitter.com/Re9BkREHTl
— pundook🔫🔫 (@subodhpahalajan) July 24, 2023