కోల్కతా: కోల్కతా న్యాయ కళాశాలలో జరిగిన అత్యాచార ఘటన కేసు(Kolkata Case)లో 31 ఏళ్ల నిందితుడు మనోజిత్ మిశ్రాను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే అతనిపై గతంలోనూ కేసులు ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్లో అతను ఓ పోలీసును కొట్టాడు. ఆ తర్వాత అతనికి ఆ కేసులో బెయిల్ మంజూరీ చేశారు. ఓ ఏటీఎం వద్ద విధులు నిర్వర్తిస్తున్న గార్డుతో మనోజిత్ గొడవ పడ్డాడు. ఆ సమయంలో పోలీసుల్ని పిలిచాడు గార్డు. అక్కడకు వచ్చిన పీసీఆర్ ఆఫీసర్పై మిశ్రా చేయి చేసుకున్నాడు.
గత ఏడాది సెప్టెంబర్లో ఓ విద్యార్థిని చంపేందుకు మనోజిత్ ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఆ ఘటన తర్వాత అతను కాలేజీ రావడం మానేశాడు. తృణమూల్ కాంగ్రెస్ ఛాత్ర పరిషత్ సౌత్ కోల్కతా డిస్ట్రిక్ట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గా మనోజిత్ మిశ్రా చేశాడు. సౌత్ కోల్కతా లా కాలేజీ క్యాంపస్ సామూహిక అత్యాచార ఘటనలో ప్రధాన నిందితుడు.
సామూహిక అత్యాచార ఘటనపై విశ్లేషణ చేపట్టేందుకు బీజేపీకి చెందిన నలుగురు సభ్యులు నిజ నిర్ధారణ కమిటీ ఇవాళ కోల్కతా చేరుకున్నది. మాజీ కేంద్ర మంత్రులు సత్పాల్ సింగ్, మీనాక్షీ లేఖీ, బిప్లబ్ కుమార్ దేబ్, మన్నన్ కుమార్ మిశ్రా ఉన్నారు. కాలేజీ వెళ్లేందుకు తమకు పర్మిషన్ దొరకలేదని బిప్లబ్ తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఈ ఘటనపై రిపోర్టు ఇవ్వనున్నట్లు చెప్పారు.
అత్యాచార బాధితురాలి తరపున న్యాయవాది అరిందమ్ కంజిలాల్ వాదించారు. నిందితులకు 20 ఏళ్ల జైలు శిక్ష విధించాలన్నారు. బెంగాలీ పోలీసులు నిందితులను త్వరగా అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు.