న్యూఢిల్లీ: దేశ రాజధానిలో సంచలనం రేపిన శ్రద్ధా హత్య కేసులో, హంతకుడు ఆఫ్తాబ్ను ఐదు రోజులపాటు పోలీస్ కస్టడీకి ఢిల్లీ కోర్టు అప్పగించింది. అలాగే నార్కో పరీక్షలు చేసేందుకు కూడా అనుమతించింది. కోర్టు వద్ద గుమిగూడిన న్యాయవాదులు, జనం ఆఫ్తాబ్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అతడ్ని ఉరి తీయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో భద్రతా కారణాలతో వర్చువల్గా కోర్టులో గురువారం హాజరుపర్చారు. దీంతో శ్రద్ధ హత్యపై మరింత దర్యాప్తు కోసం పోలీస్ కస్టడీ, నార్కో పరీక్షలకు అనుమతి కోరగా కోర్టు అంగీకరించింది.
కాగా, సహజీవనం చేస్తున్న శ్రద్ధాను ప్రియుడు ఆఫ్తాబ్ అమీన్ ఈ ఏడాది మే 18న సాయంత్రం దారుణంగా హత్య చేశాడు. నేర సీరియళ్లు, నెట్లో సర్చ్ చేసి ఆధారాలు లేకుండా చేయాలనుకున్నాడు. ఈ క్రమంలో శ్రద్ధ మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికాడు. శబ్ధం రాకుండా ఉండేందుకు నీటి పంపును వదిలాడు. అలాగే రక్తం మరకలు పోయేందుకు వేడి నీటిని ఉపయోగించాడు. కొత్తగా ఫ్రిజ్ కొని వాటిని అందులో ఉంచాడు. 18 రోజులపాటు పలు చోట్ల ఆమె మృతదేహం భాగాలను పడేశాడు.
మరోవైపు శ్రద్ధా మిస్సింగ్ కేసుపై దర్యాప్తు జరిపిన పోలీసులు ఎట్టకేలకు నిందితుడు ఆఫ్తాబ్ను ఇటీవల అరెస్ట్ చేశారు. అతడ్ని ప్రశ్నించగా ఈ కేసుకు సంబంధించిన ఎన్నో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. దీంతో శ్రద్ధా హత్య దేశవ్యాప్తంగా కలకలం రేపింది. హతురాలు, హంతకుడు మహారాష్ట్రలోని వసాయ్కు చెందినవారు. 2019లో డేటింగ్ యాప్ ద్వారా వీరిద్దరికి పరిచయం ఏర్పడగా ఢిల్లీలో సహజీవనం చేస్తున్నారు.
అయితే పెళ్లి విషయం, ఇంటి ఖర్చులు భరించడంపై ఇద్దరి మధ్య విభేదాలు రాగా మే 18న ఘర్షణ జరిగింది. దీంతో ఆగ్రహించిన ఆఫ్తాబ్, శ్రద్ధ గొంతునులిమి ఆమెను హత్య చేశాడు. పది గంటలు శ్రమించి మృతదేహాన్ని 35 ముక్కలు నరికాడు. మధ్య మధ్యలో విరామం తీసుకుని బీర్ సేవించి, సిగరెట్ తాగాడు. మృతదేహం భాగాలను బాగా నీటితో కడిగాడు. అనంతరం ఫుడ్ ఆర్డర్ చేసి తిన్నాడు. నెట్ఫ్లిక్స్లో సినిమా చేసి ఆ రాత్రి పడుకున్నాడు. శ్రద్ధా మృతదేహం ముక్కలను దాచేందుకు ఫ్రిడ్జ్ కొనుగోలు చేయడం, భారీగా వాటర్ బిల్లు వంటి ఆధారాలను సేకరించినట్లు పోలీసులు చెప్పారు. మెహ్రౌలీ అటవీ ప్రాంతంలో ఇప్పటి వరకు గుర్తించిన పది శరీర భాగాలను డీఎన్ఏ పరీక్ష కోసం పంపినట్లు వెల్లడించారు.