జైపూర్ : రాజస్థాన్ అసెంబ్లీ(Rajasthan Assembly)లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ధర్నా చేపట్టారు. అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు నిద్రపోయారు. శుక్రవారం ఆ రాష్ట్ర మంత్రి అవినాశ్ గెహ్లాట్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పేరుతో వర్కింగ్ వుమెన్స్ హాస్టళ్లను గత ప్రభుత్వం ప్రారంభించిందని ఆ మంత్రి పేర్కొన్నారు. అయితే ఆ సమయంలో దాదీ(బామ్మ) ఇందిరా గాంధీ అని మంత్రి వ్యాఖ్యానించారు. దాదీ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. నినాదాలు చేస్తూ వెల్లోకి దూసుకెళ్లారు. దీంతో స్పీకర్ ఏడు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. పలుమార్లు సభ వాయిదా పడ్డా.. ఆ ఎమ్మెల్యేలు మాత్రం సభలోనే నిరసన చేపట్టారు. ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోస్తారా కూడా ఆందోళనలో పాల్గొన్నారు.
आज रात्रि, विधानसभा में ! जनहित की बुलंद आवाज़!
आपकी आवाज़ को दबाने की किसी भी कोशिश को नाकाम करेंगे, हर मुद्दे पर मजबूती से खड़े रहेंगे!#RajasthanVidhanSabha #जनताकीआवाज pic.twitter.com/2XVcYOvZJQ
— Zakir Hussain Gesawat – MLA🇮🇳 (@ZakirHussainINC) February 21, 2025
మంత్రి అవినాశ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ప్రతిపక్ష నేత టికారం డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేను సస్పెండ్ చేసిన తర్వాత సభలోనే వాళ్లు ధర్నా చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ జోగేశ్వర్ గార్గ్ ప్రతిపాదన చేశారు. గోవింద్ సింగ్ దోస్తారా, రాంకేశ్ మీనా, అమిన్ కాగ్జి, జాకిర్ హుస్సేన్, హకమ్ అలీ, సంజయ్ కుమార్.. సస్పెండ్ అయిన వారిలో ఉన్నారు. ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన తర్వాత.. సోమవారం ఉదయం 11 వరకు సభను వాయిదా వేశారు. సభలో ధర్నా చేపట్టిన ఆ ఎమ్మెల్యేలు.. రాత్రంతా అక్కడే నిద్రపోయారు.