లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య జిల్లా మిల్కిపూర్‌లో జరిగిన ఎప ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. (BJP wins UP’s Milkipur) సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)పై జరిగిన ప్రతిష్టాత్మక పోరులో బీజేపీ అభ్యర్థి చంద్రభాన్ పాస్వాన్ గెలిచారు. ఎస్పీ అభ్యర్థి అజిత్ ప్రసాద్‌ను 60,000కు పైగా ఓట్ల తేడాతో ఓడించారు. దీంతో బీజేపీలో ఉత్సాహం ఉరకలువేసింది. 2027లో జరుగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు మిల్కిపూర్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితాలు కేవలం ‘ట్రైలర్’ అని డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య అన్నారు. ‘ఇది కేవలం ట్రైలర్, మొత్తం చిత్రం 2027లో వెల్లడవుతుంది. సమాజ్‌వాదీ పార్టీ జీరో అవుతుంది’ అని విమర్శించారు.
కాగా, ప్రతిష్టాత్మక రామాలయాన్ని నిర్మించిన అయోధ్య జిల్లాలోని ఫైజాబాద్ లోక్‌సభ స్థానంలో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి అవధేష్ ప్రసాద్ బీజేపీ అభ్యర్థిపై ఘన విజయం సాధించారు. పార్లమెంట్‌కు ఆయన ఎంపిక కావడంతో షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ చేసిన అయోధ్య జిల్లాలోని మిల్కిపూర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆధిపత్య పాసి వర్గానికి చెందిన అవధేష్ కుమారుడు అజిత్ ప్రసాద్‌ను ఎస్పీ పోటీకి దించింది. అయితే ఇరు పార్టీల మధ్య జరిగిన ప్రతిష్టాత్మక పోరులో అదే వర్గానికి చెందిన బీజేపీ అభ్యర్థి చంద్రభాను పాశ్వాన్ ఘన విజయం సాధించారు.