న్యూఢిల్లీ: ఢిల్లీలో 2016లో జరిగిన మెర్సిడీజ్ హిట్ అండ్ రన్ కేసు(Mercedes Hit-And-Run case)లో.. మోటారు యాక్సిడెంట్ ట్రిబ్యునల్ కీలక ఆదేశాలు జారీ చేసింది. బాధిత కుటుంబసభ్యులకు 1.98 కోట్ల నష్టపరిహారాన్ని ఇవ్వాలని ఇన్సూరెన్స్ కంపెనీని ట్రిబ్యునల్ ఆదేశించింది. మెర్సిడీజ్ను మైనర్ నడిపిన ఘటనలో.. 32 ఏళ్ల సిద్ధార్ధ శర్మ అనే వ్యక్తి మరణించాడు. రూ.1.21 కోట్లను పరిహారంగా, 77.61 లక్షలను వడ్డీ రూపంలో.. సిద్ధార్థ శర్మ పేరెంట్స్‌కు 30 రోజుల్లోగా ఇవ్వాలని ఇన్సూరెన్స్ కంపెనీని ట్రిబ్యునల్ ఆదేశించింది.
ఢిల్లీలోని సివిల్ లైన్స్‌లో 2016, ఏప్రిల్ 4వ తేదీన యాక్సిడెంట్ జరిగింది. ఓ మైనర్ మెర్సిడీజ్ కారును డ్రైవ్ చేశాడు. మెర్సిడీజ్ ఢీకొన్న ఘటనలో సిద్ధార్థ శర్మ ప్రాణాలు కోల్పోయాడు. ఆ ఏరియాలో ఇన్స్టాల్ చేసిన సెక్యూర్టీ కెమెరాకు ఆ యాక్సిడెంట్ చిక్కింది. మైనర్ కుమారుడిని అడ్డుకోవడంలో తండ్రి విఫలమైనట్లు కూడా ట్రిబ్యునల్ పేర్కొన్నది. ప్రమాదం జరిగిన సమయంలో కారు చాలా వేగంతో ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. కారు ఢీకొన్న సమయంలో సిద్ధార్థ సుమారు 20 ఫీట్ల ఎత్తుకు ఎగిరిపడినట్లు రిపోర్టులో పేర్కొన్నారు.