ఇంఫాల్, ఆగస్టు 11: మణిపూర్లో ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇరు వర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు మృతి చెందారు. తెంగ్నోపాల్ జిల్లాలోని ఓ గ్రామంలో యునైటెడ్ కుకీ లిబరేషన్ ఫ్రంట్ మిలిటెంట్లకు, అదే సామాజిక వర్గానికి చెందిన గ్రామ వాలంటీర్లకు మధ్య శుక్రవారం మల్నోమ్ ప్రాంతంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు వాలంటీర్లు, ఒక మిలిటెంట్ మృతి చెందారు. దీంతో ఆగ్రహం చెందిన వాలంటీర్లు యూకేఎల్ఎఫ్కు చీఫ్గా ప్రకటించుకున్న ఎస్ఎస్ హాకొపి గృహాన్ని దహనం చేశారు. పల్లెల ప్రాంతంలో రుసుంల వసూళ్లపై ఆధిపత్యం కోసమే ఈ కాల్పులు జరిగినట్టు భావిస్తున్నారు. కాల్పుల ఘటనతో అప్రమత్తమైన భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి.