గుణ, అక్టోబర్ 12: సాధారణంగా బోరింగు (చేతిపంపు) కొడితే ఏమొస్తాయి? ఇదేం ప్రశ్న? నీళ్లే కదా వచ్చేది? అని విసుక్కొంటున్నారా? కానీ, ఒక్కోసారి సారా కూడా వస్తుంది. అవును.. మధ్యప్రదేశ్‌లో ఓ చేతిపంపు కొట్టగానే ధారాళంగా నాటు సారా వస్తున్నది. గుణ జిల్లాలోని భాన్పూర్ గ్రామంలో ఈ విచిత్రమైన చేతిపంపును చూసి పోలీసులే ముక్కున వేలేసుకొన్నారు. అసలు విషయం ఏంటంటే.. కొందరు అక్రమ నాటు సారా ఉత్పత్తిదారులు వ్యవసాయ పొలంలో దాణా గోదాం కింద భూగర్భంలో సారా డంప్‌ను ఏర్పాటుచేశారు. డ్రమ్ములకొద్దీ సారా నిల్వ ఉంచారు.
ప్రతిసారీ సారా కోసం లోపలికి దిగి పైకి ఎక్కటం దేనికి అనుకొన్నారేమో.. ఆ డ్రమ్ములకు ఉపరితలం నుంచి ఓ చేతిపంపును తగిలించారు. అంతే.. పంపు కొట్టగానే ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన పైపులోంచి సారా తన్నుకొస్తున్నది. ఈ విషయం పొలీసుల చెవిన పడటంతో సోమవారం సోదాలు నిర్వహించారు. అక్కడ అమర్చి ఉన్న చేతి పంపును కొట్టగానే నాటు సారా బయటకు వచ్చింది.