కోల్‌కతా: ముగ్గురు మహిళలు ఒక ఇంట్లో అనుమానాస్పదంగా మరణించారు. (Three Women Found Dead) వారిలో ఒక యువతి కూడా ఉన్నది. వారి చేతిమణికట్టు వద్ద కోసుకున్న గాయాలున్నాయి. ఈ నేపథ్యంలో ముగ్గురు మహిళలది ఆత్మహత్యా లేక హత్యా అన్నది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఈ సంఘటన జరిగింది. బుధవారం తెల్లవారుజామున తూర్పు మెట్రోపాలిటన్ బైపాస్‌లోని రూబీ క్రాసింగ్ సమీపంలో రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించాడు. ఆ వ్యక్తి గుర్తింపు కార్డు ద్వారా అతడి ఇంటికి పోలీసులు చేరుకున్నారు.
కాగా, తాంగ్రా ప్రాంతంలోని ఆ అడ్రస్‌కు వెళ్లిన పోలీసులు షాక్ అయ్యారు. మృతుడి భార్య, మరో మహిళ, ఒక యువతి ఆ ఇంట్లో అనుమానాస్పదంగా మరణించారు. వారి చేతిమణికట్టు వద్ద కోసి ఉండటాన్ని పోలీసులు గమనించారు. పోస్ట్‌మార్టం కోసం వారి మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు ఆ కుటుంబంలో ఏమైనా గొడవలు జరుగుతున్నాయా? అని స్థానికులను పోలీసులు ఆరా తీశారు. ముగ్గురు మహిళలు ఆత్మహత్యకు పాల్పడ్డారా లేక వారు హత్యకు గురయ్యారా అన్నది పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్‌లో తెలుస్తుందని పోలీస్ అధికారి తెలిపారు.