బెంగుళూరు: బంగారం స్మగ్లింగ్ కేసుతో లింకున్న కర్నాటక డీజీపీ కే రామచంద్ర రావు( DGP Ramachandra Rao)కు ఊరట దొరికింది. రాంచంచ్రరావును పునర్ నియమిస్తూ ఇవాళ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కుమార్తె, నటి రాన్యా రావుతో లింకు ఉన్న గోల్డ్ స్మగ్లింగ్ కేసులో డీజీపీ రాంచంద్రరావుపై చర్యలు తీసుకున్నారు. తప్పనిసరి లీవ్ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకున్నది. డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీపీగా ఆయన్ను పోస్టు చేశారు. ఆయన1993 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్.
కొన్ని నెలల క్రితం బెంగుళూరు విమానాశ్రయంలో నటి రాన్యా రావును అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆమె వద్ద నుంచి 14.2 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వస్తున్న ఆమెను డైరెక్టరేట్ రెవన్యూ ఇంటెలిజెన్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ఆమె తండ్రి రాంచంద్రరావుపై చర్యలు తీసుకున్నారు. మార్చి నెలలో ఆయనకు తప్పనిసరి లీవ్‌ను కల్పించారు. రాన్యారావుకు రక్షణగా వెళ్లిన కానిస్టేబుల్‌ను కూడా ఈ కేసులో పట్టుకున్నారు. అయితే తనకు ఇచ్చిన ఆదేశాల ప్రకారమే డ్యూటీ నిర్వర్తించినట్లు ఆ కానిస్టేబుల్ చెప్పాడు. గోల్డ్ స్మగ్లింగ్‌తో తనకు సంబంధంలేదన్నాడు.
డీఆర్ఐ, సీబీఐ, ఈడీ.. ఈ కేసులో దర్యాప్తు చేపడుతున్నాయి. స్మగ్లింగ్ కేసులో తన పాత్ర లేదని డీజీపీ రాంచంద్రరావు తెలిపారు. తన తండ్రికి స్మగ్లింగ్‌కు సంబంధం లేదని రాన్యా రావు పేర్కొన్నది. ప్రస్తుతం నటి రాన్యా రావు జైలులోనే ఉన్నది.