లక్నో: యూనివర్శిటీ హాస్టల్లో ఫుడ్ పాయిజనింగ్ జరిగింది. ఈ నేపథ్యంలో 300 మందికిపైగా మహిళా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. (Food Poisoning) వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో ఈ సంఘటన జరిగింది. అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీ క్యాంపస్‌లోని లేడీస్ హాస్టల్లో సుమారు 1,500 మంది విద్యార్థినులున్నారు. మంగళవారం రాత్రి భోజనం తర్వాత వాంతులు, ఇతర అనారోగ్య కారణాలతో 300 మందికిపైగా విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
కాగా, ఈ విషయం తెలిసిన తర్వాత ఆరోగ్య శాఖ అధికారులు ఆ హాస్టల్ మెస్‌కు చేరుకున్నారు. డైనింగ్ హాల్, కిచెన్ నుంచి ఆహార నమానాలు సేకరించి పరీక్ష కోసం పంపారు. ఈ సంఘటనపై దర్యాప్తు కోసం ముగ్గురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసినట్టు అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీ ప్రతినిధి తెలిపారు. అలాగే బుధవారం టీచర్స్‌తో సమావేశం కూడా నిర్వహించినట్లు వెల్లడించారు. అయితే ఆహార పదార్థాల కొనుగోలులో అక్రమాలు, నాసిరకం పదార్థాల సరఫరానే దీనికి ప్రధాన కారణమని ఏఎంయూ టీచర్స్ అసోసియేషన్ కార్యదర్శి ఒబైద్ అహ్మద్ సిద్ధిక్ ఆరోపించారు.