టోక్యో : మెరుగైన, సౌకర్యవంతమైన జీవితం కోసం ప్రపంచం నలుమూలలా వినూత్న ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. వనరులను సమర్ధవంతంగా, సంపూర్ణంగా వినియోగించుకునేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ ఒరవడిలోనే జపాన్‌లో ఓ టాయిలెట్‌తో కూడిన ఇమేజ్ ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ఈ పిక్చర్లో సింక్‌తో కూడిన టాయిలెట్ నెటిజన్లను ఆకట్టుకుంది.
ఫాస్కినేటింగ్ అనే పేజ్ ఈ వైరల్ పోస్ట్‌ను ట్విట్టర్లో షేర్ చేసింది. టాయిలెట్ పై భాగంలో సింక్ ఉన్న ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. నీటిని ఆదా చేసే ఉద్దేశంతో ఈ ఐడియాను ఆచరణలో పెట్టారు. సింక్‌లో చేతులు శుభ్రం చేసుకోగానే అదే నీరును తర్వాత ఫ్లష్ చేసినప్పుడు తిరిగి వాడుకునే వెసులుబాటు ఉంది. పలు జపాన్ టాయిలెట్లలో హ్యాండ్‌వాష్ సింక్ ఉంటుంది. దీంతో చేతులు శుభ్రం చేసుకున్న తర్వాత ఆ నీరును నెక్ట్స్ ఫ్లష్ చేసినప్పుడు తిరిగి వాడుకునేలా వీటిని అమర్చారు.
ఈ రకంగా జపాన్ ఏటా లక్షల లీటర్లను ఆదా చేస్తుందని పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. ఈ పోస్ట్ ఆన్లైన్లో వైరల్‌గా మారగా ఇప్పటివరకూ లక్షకు పైగా లైక్స్ వచ్చాయి. ఈ పోస్ట్‌పై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభించింది. చిన్నగా ఉన్న ఈ సింక్‌తో చేతులు శుభ్రం చేసుకోలేమని, నీళ్లు ఎటువైపైనా వెళతాయని ఓ యూజర్ రాయగా, అందుకే జపనీయులను తాను ఇష్టపడతానని మరో యూజర్ రాసుకొచ్చారు.