లూథియానా: రాజకీయ నాయకులు.. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియదు. అంగీలు మార్చినంత ఈజీగా పార్టీలు మార్చేస్తుంటారు. ఎన్నికల సమయంలో ఇక చెప్పాల్సిన పనిలేదు. ఈ రోజు ఒక పార్టీ కండువాతో కనిపిస్తే.. మరో రోజు ఇంకో పార్టీ గుర్తుతో ప్రచారం చేస్తుంటారు. అసలు వారు ఎప్పుడు ఏ చెట్టు కిందికి చేరుతారో వారికే తెలియాలి. అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు తిరుగుతూ ఉంటారు. అచ్చం ఇలానే ఉంది పంజాబ్‌లోని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బల్విందర్ సింగ్ లద్దీ పరిస్థితి.
బల్విందర్ సింగ్ లద్దీ గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై శ్రీ హర్‌గోవింద్‌పూర్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అయితే జనవరిలో ఆయన కాంగ్రెస్ సీనియర్ లీడర్ ఫతేజంగ్ బజ్వాతో కలిసి బీజేపీలో చేరారు. వారం తిరగకుండానే సీఎం చన్నీ సమక్షంలో కాంగ్రెస్‌లోకి వచ్చేశారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తన సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ మరో నాయకునికి కేటాయింది.
దీంతో అలకబూనిన ఆయన మరోసారి కమలం పార్టీలోకి జంప్ అయ్యారు. అక్కడ కూడా ఆయనకు నిరాశ తప్పలేదు. ఎందుకంటే అప్పటికే కాషాయం పార్టీ తన ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించింది. దీంతో ఉన్నది పోయింది.. ఉంచుకున్నది పోయింది అన్నట్లు తరయారైంది బల్విందర్ సింగ్ సంగతి.
117 అసెబ్లీ స్థానాలున్న పంజాబ్‌లో ఫిబ్రవరి 20న ఒకే విడుతలో ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, ఆప్, బీజేపీ మధ్య ముక్కోణపు పోటీ నెలకొని ఉంది. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.