ముంబై: ఫైనాన్స్ సంస్థల కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) అధికారులు రైడ్ చేశారు. (tax raids) మూడు రోజుల పాటు సోదాలు నిర్వహించారు. రూ.170 కోట్ల విలువైన నగదు, నగలు, ఆస్తులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఈ సంఘటన జరిగింది. సోదరులైన వినయ్ భండారి, సంజయ్ భండారి, ఆశిష్ భండారీ, సంతోష్ భండారీ, మహావీర్ భండారీ, పదం భండారీకి నాందేడ్‌లో పెద్ద ఫైనాన్స్ సంస్థలున్నాయి.
కాగా, ఆ సోదరులకు చెందిన ఫైనాన్స్ సంస్థలు భారీగా పన్నులు ఎగవేసినట్లు ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) అధికారులు గుర్తించారు. దీంతో పూణే, నాసిక్, నాగ్‌పూర్, పర్భానీ, ఛత్రపతి శంభాజీనగర్, నాందేడ్‌కు చెందిన వందల మంది ఐటీ అధికారులు 25 ప్రైవేట్ కార్లలో నాందేడ్ చేరుకున్నారు. మే 10 నుంచి 12 వరకు మూడు రోజుల పాటు పలు చోట్ల రైడ్ చేశారు. అలీ భాయ్ టవర్లోని భండారీ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయం, కొఠారీ కాంప్లెక్స్‌లోని కార్యాలయం, కోకాటే కాంప్లెక్స్‌లోని మూడు కార్యాలయాలు, ఆదినాథ్ అర్బన్ మల్టీస్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్‌లో సోదాలు నిర్వహించారు. అలాగే పరాస్ నగర్, మహావీర్ సొసైటీ, ఫరాండే నగర్, కాబ్రా నగర్‌లోని వారి ప్రైవేట్ నివాసాలపై కూడా దాడులు చేశారు.
మరోవైపు మూడు రోజుల పాటు ఐటీ అధికారులు నిర్వహించిన సోదాల్లో భారీగా నగదు, నగలు బయటపడ్డాయి. సుమారు 14 గంటలపాటు వాటిని లెక్కించారు. రూ.14 కోట్ల నగదు, 8 కిలోల బంగారంతో సహా రూ.170 కోట్ల విలువైన లెక్కల్లో చూపని ఆస్తులను సీజ్ చేశారు. కాగా, నాందేడ్‌లో ఇంత పెద్ద ఎత్తున ఐటీ రైడ్స్ జరుగడం ఇదే తొలిసారి.