పాకిస్తాన్ ప్రధాని ఖర్చు విషయమై పాక్ మీడియాలో పుంఖాను పుంఖాలుగా చర్చలు నడుస్తున్నాయి. ఇమ్రాన్ స్నేహితుడు, సుప్రీం కోర్టు మాజీ జస్టిస్ వజీవుద్దీన్ అహ్మద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇల్లు గడవాలంటే నెలకు 50 లక్షల రూపాయలు కావాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇమ్రాన్ నిజాయితీపరుడనుకుంటే పప్పులో కాలేసినట్లేనని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఆయనకు అత్యంత సన్నిహితుడైన జహంగీర్ తరీన్ ప్రతి నెలా ఆయనకు 50 లక్షల రూపాయలను పంపుతారని ఆయన పేర్కొన్నారు.
మొదట్లో ఇల్లు గడవానికి 20 లక్షలు ఖర్చయ్యేవని, ఆ తర్వాత 30 లక్షలు… ప్రస్తుతానికి 50 లక్షల రూపాయలు ప్రతి నెలా కావాల్సిందేనని వజీవుద్దీన్ పేర్కొన్నారు. ”ఇమ్రాన్ ఖాన్ నిజాయితీపరుడనుకుంటే మీ భ్రమే అవుతుంది. ఆయను అత్యంత దగ్గరిగా నేను చూశా. కొన్ని రోజుల పాటు ఇమ్రాన్ ఇంటి ఖర్చుల వ్యవహారం జహంగీర్ తరీనే చూసేవారు. ఇమ్రాన్ అధికారంలో లేనప్పుడు ఇల్లు గడవడం కోసం 20 లక్షలు ఇచ్చేవారు. ఆ తర్వాత అవి 30 లక్షలయ్యాయి. ఇప్పుడు 50 లక్షలకు చేరుకుంది.” అని వజీవుద్దీన్ అహ్మద్ పేర్కొన్నారు.