న్యూఢిల్లీ : రష్యన్ సంతతికి చెందిన విక్టోరియా బసు అనే మహిళ భారత పౌరుడైన తన కొడుకుతో కలిసి భారత్ నుంచి పారిపోవడం దౌత్యపరమైన చిక్కుగా మారింది. ఈ విషయమై శుక్రవారం ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు పిల్లాడి ఆచూకీ కనిపెట్టడంలో ఆలస్యంపై కేంద్రాన్ని ప్రశ్నించింది. దౌత్య, న్యాయ మార్గాల ద్వారా ఆ చిన్నారి జాడను తెలుసుకోవాలని కోరింది.
దీనిపై అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) స్పందిస్తూ రష్యాలోని భారత ఎంబసీ ఈ విషయమై రష్యన్ అధికారులను సంప్రదించిందని కానీ ఇప్పటివరకు సహాయపడదగ్గ స్పందనేది లభించలేదని తెలిపారు. దీనిపై కోర్ట్ స్పందిస్తూ కొన్నిసార్లు ఇలాంటి విషయాలు ఇరు దేశాల సంబంధాలపై తెలియకుండానే ప్రభావం చూపుతాయని.. ఇది భారత పౌరుడిని రక్షించే విషయం కూడా అని నొక్కి చెప్పింది.