US Citizenship | న్యూఢిల్లీ, మే 30 : అమెరికా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే, నైతిక ప్రవర్తన సరిగా లేనివారు ‘న్యూట్రలైజేషన్’కు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని అమెరికా పౌరసత్వ, శరణార్థి సేవల విభాగం (యూఎస్సీఐఎస్) స్పష్టం చేసింది. నైతిక ప్రవర్తన సరిగా లేని గ్రీన్‌కార్డు హోల్డర్లకు అమెరికా పౌరసత్వాన్ని మంజూరు చేసే అంశాన్ని పరిశీలించబోమని పేర్కొంటూ.. దరఖాస్తుదారులు ఉన్నత నైతిక, సామాజిక ప్రమాణాలకు అనుగుణంగా ఉండాల్సిందేనని తేల్చిచెప్పింది. గ్రాండ్ తెఫ్ట్ ఆటో అనే దొంగతనానికి సంబంధించిన యాక్టివ్ వారెంట్‌తో అమెరికాలోకి ప్రవేశించిన ఓ వలసదారుడి కేసును ప్రస్తావిస్తూ యూఎస్సీఐఎస్ ఈ హెచ్చరిక చేసింది.
అమెరికా పౌరుడు కావడం గొప్ప హక్కని, అమెరికాను నిర్వచించే విలువలు, బాధ్యతలు, స్వేచ్ఛలను స్వీకరించే వారికే ఈ గౌరవం ఇవ్వబడుతుందని, అంతేతప్ప ఇది అందరికీ హామీ ఇవ్వబడిన హక్కు కాదని ‘ఎక్స్’ (ట్విట్టర్)లో యూఎస్సీఐఎస్ పేర్కొన్నది. అమెరికా పౌరసత్వ చట్టంలో ‘మంచి నైతిక స్వభావం’ అనేది దరఖాస్తుదారులు నిరూపించుకోవాల్సిన చట్టబద్ధమైన ప్రమాణమని, స్టాట్యుటరీ పీరియడ్ (సాధారణంగా పౌరసత్వ దరఖాస్తుకు ముందు ఐదేండ్లు)లో తమ ప్రవర్తన సమాజంలోని సగటు సభ్యుడు ఆశించే నైతిక ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్టు దరఖాస్తుదారులు నిరూపించుకోవాల్సి ఉంటుందని ‘బర్జియన్ లా’ సీనియర్ పార్ట్నర్ కేతన్ ముఖీజా తెలిపారు.
గ్రీన్‌కార్డు హోల్డర్ అమెరికా పౌరుడిగా మారే ప్రక్రియనే న్యూట్రలైజేషన్ అంటారు. ఇందుకు సాధారణంగా దరఖాస్తుదారుడి స్థితిగతులను బట్టి మూడు నుంచి ఐదేండ్ల సమయం పడుతుంది. దరఖాస్తుదారులు నివాస నిబంధనలను పాటించడం, మంచి నైతిక స్వభావాన్ని కలిగి ఉన్నట్టు నిరూపించుకోవడంతోపాటు ఇంగ్లిష్, పౌరశాస్త్ర పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాలి. అమెరికా పట్ల విధేయతను ప్రకటిస్తూ ప్రమాణం చేయాలి.