న్యూఢిల్లీ: హెచ్-1బీ వీసా సహా అనేక ఇమిగ్రేషన్ ప్రయోజనాల ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజును మార్చి 1 నుంచి పెంచనున్నట్లు అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) శనివారం ప్రకటించింది. 2023 జూన్ నుంచి 2025 జూన్ మధ్య ఏర్పడిన ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజును పెంచుతున్నట్లు యూఎస్సీఐఎస్ తెలిపింది. దీంతో భారతీయులు సహా విదేశీ వృత్తి నిపుణులు ఉపయోగించే ఉపాధి ఆధారిత నాన్ ఇమిగ్రెంట్ వీసా దరఖాస్తులపై ప్రభావం పడనున్నది.
మారిన ఫీజుల ప్రకారం హెచ్-2బీ లేదా ఆర్-1 నాన్ఇమిగ్రెంట్ స్టేటస్కు చెందిన ఫామ్ I-129 దరఖాస్తుల ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజు 1,685 డాలర్ల(రూ. 1.52 లక్షలు) నుంచి 1,780 డాలర్లకు(రూ. 1.70 లక్షలు) పెరిగింది. హెచ్-1బీ, ఎల్-1, ఓ-1, పీ-1, టీఎన్ వీసాలు సహా ఫామ్ I-129 దరఖాస్తులకు సంబంధించిన ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజు 2,805 డాలర్ల(రూ. 1.88 లక్షలు) నుంచి 2,965 డాలర్లకు(రూ. 2.67 లక్షలు) పెరిగింది. ఇదే ఫీజు ఫామ్ I-140 ఇమిగ్రెంట్ దరఖాస్తులకు కూడా వర్తిస్తుంది. ఎఫ్-1, ఎఫ్-2 విద్యార్థులు, జే-1, జే-2 ఎక్సేంజ్ విటిజర్లు, ఎం-1, ఎం-3 వొకేషనల్ విద్యార్థుల ఎక్స్టెన్షన్ లేదా నాన్ఇమిగ్రెంట్ స్టేటస్ మార్పునకు సంబంధించిన ఫామ్ 1-539 దరఖాస్తుల ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజు 1,965 డాలర్ల(రూ. 1.77 లక్షలు) నుంచి 2,075 డాలర్లకు(రూ. 1.87 లక్షలు) పెరిగింది.