Mobile Congress | భారత్, ఆసియాలోనే అతిపెద్ద టెక్ ఫెయిర్‌గా గుర్తింపు పొందిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC) బుధవారం ప్రారంభమైంది. బుధవారం నుంచి శనివారం వరకు న్యూఢిల్లీ యశోభూమి కన్వెన్షన్ సెంటర్లో జరుగుతుంది. మొబైల్ కాంగ్రెస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించి మాట్లాడారు. దేశంలోని యువతరం సాంకేతిక విప్లవానికి గణనీయమైన కృషి చేస్తోందన్నారు. గతంలో భవిష్యత్తు అంటే వచ్చే శతాబ్దం.. రాబోయే 10-20 సంవత్సరాలు అని అర్థమని.. కానీ సాంకేతికత చాలా వేగంగా మారుతోందన్నారు. ఇప్పుడు మన భవిష్యత్తు ఇప్పుడు.. ఇక్కడే ఉందన్నారు. భారత్‌లో మొబైల్ డేటా చౌకగా ఉందన్నారు. ప్రస్తుతం భారతదేశంలో ఒక జీబీ వైర్లెస్ డేటా కప్పు టీ ధర కంటే తక్కువ ఖర్చు అవుతుందన్నారు.
డేటా వినియోగం విషయానికి వస్తే భారతదేశం ప్రపంచంలోని ప్రముఖ దేశాలలో ఒకటి.. దీని అర్థం డిజిటల్ కనెక్టివిటీ ఇకపై విలాసం, ప్రత్యేక హక్కు కాదన్నారు. కానీ, భారతీయ జీవితంలో అంతర్భాగంగా మారిందన్నారు. తాను ప్రదర్శనలోని కొన్ని స్టాళ్లను సందర్శించానన్న ఆయన.. తనకు భవిష్యత్తును చూపించాయన్నారు. టెలికాం కనెక్టివిటీ, 6జీ టెక్నాలజీ, ఏఐ, సైబర్ సెక్యూరిటీ సెమీకండక్టర్లు, డ్రోన్-స్పేస్ టెక్నాలజీ, డీప్-సీ, గ్రీన్-టెక్ మొదలైన సాంకేతిక రంగాల్లో రాబోయే కాలం పూర్తిగా భిన్నంగా ఉండబోతోందన్నారు. 6జీ టెక్నాలజీలో భారత్ ప్రపంచాన్ని ముందుండి నడిపిస్తుందని తాను విశ్వసిస్తున్నానని ప్రధాని పేర్కొన్నారు. ఇంటర్నెట్ వేగం, ప్రాముఖ్యతను హైలైట్ చేస్తూ ఇంటర్నెట్ వేగం కేవలం నెంబర్స్, ర్యాంకింగ్స్ గురించి మాత్రమే కాదన్నారు. మంచి ఇంటర్నెట్ వేగం జీవన సౌలభ్యాన్ని కూడా పెంచుతుందని మోదీ తెలిపారు. పెరిగిన ఇంటర్నెట్ వేగం కనెక్టివిటీని సులభతరం చేస్తుందని.. గతంలో పొందడం కష్టంగా ఉన్న హక్కులను సాధారణ పౌరులు పొందడంలో సాంకేతికత సహాయపడిందని.. టెలికాం రంగం ఇందులో ప్రధాన పాత్ర పోషించిందన్నారు.
కేబుల్ ఇంటర్నెట్ 2లక్షల గ్రామ పంచాయతీలకు చేరుకుందన్నారు. అటల్ టింకరింగ్ ల్యాబ్ (ATL) మిషన్ 10వేల ల్యాబ్‌ల ద్వారా 7.5 మిలియన్ల మంది పిల్లలను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానించిందని మోదీ తెలిపారు. ఈ రోజు సాంకేతిక సంస్థల్లో 100 యూజ్ కేస్ ల్యాబ్‌లను ప్రారంభించడం ఈ వృద్ధిని వేగవంతం చేస్తుందని ప్రధాని పేర్కొన్నారు. ఆసియాలో అతిపెద్ద టెక్, టెలికాం ఈవెంట్ అయిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఆసియాలో అతిపెద్ద టెలికాం, మీడియా, టెక్నాలజీ ఈవెంట్ అని తెలిపారు. ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమ నిపుణులు, విధాన నిర్ణేతలు, టెక్ ఇన్నోవేటర్లు పాల్గొంటారు. నాలుగు రోజుల ఈవెంట్లో ఆప్టికల్ కమ్యూనికేషన్స్, సెమీకండక్టర్స్, క్వాంటం కమ్యూనికేషన్స్, 6జీ తదితర కీలక అంశాలపై ప్రదర్శనలు, చర్చలు సాగుతాయి. ఈ ఈవెంట్లో జపాన్, కెనడా, యూకే, రష్యా, ఐర్లాండ్, ఆస్ట్రియా వంటి దేశాల నుంచి ప్రతినిధులు సహా 800 మందికిపైగా స్పీకర్స్, 100కిపైగా సెషన్స్ ఉంటాయి.