Devegowda: అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 22న ఘనంగా ప్రాణప్రతిష్ఠ నిర్వహణ కోసం సర్వం సిద్ధం చేశారు. ఈ కార్యక్రమం కోసం శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్టు వారు పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు పంపించారు. విపక్ష పార్టీలకు చెందిన పలువురు ఈ ఆహ్వానాలను తిరస్కరించారు. బీజేపీ, ఆరెస్సెస్ ఎన్నికల్లో లబ్ధి కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయని విమర్శించారు.
ఈ క్రమంలో జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవేగౌడ మాత్రం తాను ఈ నెల 22న అయోధ్యలో జరిగే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరవుతానని చెప్పారు. తనకు ఆహ్వానం అందిందన్నారు. తన కుటుంబం కోసం ప్రత్యేక విమానాన్ని కూడా ఏర్పాటు చేశారని తెలిపారు.
అదేవిధంగా వచ్చే లోక్సభ ఎన్నికలు చాలా ముఖ్యమైన ఎన్నికలని దేవేగౌడ అన్నారు. ఈ ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నానని చెప్పారు. నేను పోటీ చేస్తానా లేదా అనే విషయంలో ఎలాంటి సందేహం అక్కర్లేదని ఆయన వ్యాఖ్యానించారు.