మండి, ఆగస్టు 13: విద్యార్థులందరూ భగవద్గీత, పునర్జన్మ వంటి అంశాలను నేర్చుకోవాల్సిందే అంటూ ఐఐటీ మండి తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థుల కోసం ‘వివేకం, శ్రేయస్సు పరిచయం’ పేరుతో ఓ కోర్సును ఐఐటీ మండి చేర్చింది. నూతనంగా ప్రారంభించిన ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్(ఐకేఎస్) విభాగం ఈ కోర్సును అందిస్తున్నది.
ఇందులో సూక్ష్మ శరీరం, పునర్జన్మ, మరణానికి చేరువ, వంటి పలు అంశాలు ఉన్నాయి. దీంతో పాటు ప్రతివారం విద్యార్థులంతా భగవద్గీత పారాయణం, యోగా తరగతులకు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించింది. విద్యార్థుల హాజరును కూడా నమోదు చేస్తున్నది.
ఐఐటీ మండి తీసుకున్న ఈ నిర్ణయాలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది విద్యార్థులపై మతపరమైన ఆచారాలను రుద్దే ప్రయత్నమని పలువురు విమర్శిస్తున్నారు. 2022లో కొత్త డైరెక్టర్ వచ్చినప్పటి నుంచి ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.