ఖరగ్‌పూర్, జూలై 8: విద్యాసంస్థల్లో ఒత్తిడిని తట్టుకోలేక.. మనసులో భావాలు పంచుకునే అవకాశం లేక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఉదంతాలు పెరుగుతున్నాయి. విద్యార్థులకు అండగా ఉంటూ.. ఆత్మహత్యలను అరికట్టే లక్ష్యంతో ఖరగ్‌పూర్ ఐఐటీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘క్యాంపస్ మదర్స్’ పేరుతో ప్రోగ్రామ్‌కు రూపకల్పన చేసింది. ఈ విద్యాసంస్థలో ఈ ఏడాదిలోనే ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. కొత్తగా డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన సుమన్ చక్రవర్తి క్యాంపస్ మదర్స్ కార్యక్రమాన్ని ప్రకటించారు. విద్యార్థులు సమస్యలను చెప్పుకునేందుకు, భావోద్వేగాల నుంచి సాంత్వన పొందేందుకు ఈ ప్రోగ్రామ్ తోడ్పడుతుందని చెప్పారు. ఇన్స్టిట్యూట్లోని బోధన, బోధనేతర సిబ్బందికి ‘క్యాంపస్ మదర్స్’గా శిక్షణ అందిస్తామని తెలిపారు. ఏదైనా ఘటన జరిగినప్పుడు స్పందించడం కాకుండా ముందస్తు నివారణ చర్యల్లో భాగంగా ఈ కార్యక్రమం రూపకల్పన చేసినట్టు చెప్పారు.