Nano Materials | న్యూఢిల్లీ : మన చుట్టూ ఉన్న జీవ వ్యవస్థలో విషపూరిత లోహాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా పాదరసం (మెర్క్యూరీ) పర్యావరణం, జీవ కణాల్లోకి చొచ్చుకెళ్లిందంటే చాలా ప్రమాదకరం. దీనిని గుర్తించేందుకు ఐఐటీ-గువహటి పరిశోధకులు ఓ వినూత్న పద్ధతిలో నానో మెటీరియల్స్‌ను అభివృద్ధి చేశారు.
జీవ సంబంధమైన వ్యవస్థల్లో లోహాల విష ప్రభావాన్ని, వ్యాధి నిర్ధారణకు తమ పరిశోధన దోహదపడుతుందని, అంతేగాక పర్యావరణ పర్యవేక్షణలో ఈ ఆవిష్కరణ విప్లవాత్మక మార్పులకు దారి తీస్తుందని వారు చెబుతున్నారు. ఈ పరిశోధన వివరాలు జర్నల్ ఆఫ్ మెటీరియల్స్ కెమెస్ట్రీ, మెటీరియల్స్ టుడే కెమిస్ట్రీలో ప్రచురితమయ్యాయి. దీనిపై ఐఐటీ-గౌహతీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సైకత్ భౌమిక్ మాట్లాడుతూ, ‘కలుషిత ఆహారం, నీరు, గాలి పీల్చినప్పుడు లేదా చర్మం ద్వారా పాదరసం శరీరంలోపలికి చేరితే చాలా ప్రమాదకరం.
దీనివల్ల నాడీ వ్యవస్థ దెబ్బ తినటం, అవయవాలు పనిచేయకపోవటం..మొదలైన తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. మన చుట్టూ ఉన్న జీవ వ్యవస్థలో పాదరసం వంటి విషపూరిత లోహాల్ని గుర్తించటం చాలా కీలకం. దీనికి నానోక్రిస్టల్ చాలా ముఖ్య భూమిక వహిస్తాయి’ అని చెప్పారు.