Cyber Crime : డబ్బు సంపాదించాలనే ఆశతో ఐఐటీలో చదివిన ఒకతను అడ్డ దారి తొక్కాలనుకున్నాడు. పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) మిషిన్ ద్వారా భారీ మొత్తంలో డబ్బులు కాజేయాలనుకున్నాడు. పీఓఎస్ మిషన్ కొనేందుకు ప్రయత్నిస్తుండగా అతడిని పోలీసులు పట్టుకున్నారు. ఉత్దర ప్రదేశ్‌కు చెందిన నవనీత్ పాండే ఐఐటీ ఖరగ్‌పూర్ డ్రాపవుట్. బెంగళూరులో ఉంటున్న తాను కాలేజి నుంచి బయటికి వచ్చాక ఈజీగా డబ్బులు సంపాదించాలి అనుకున్నాడు. అందుకని స్థానికంగా ఉన్న కిదాంబిస్ కిచెన్ రెస్టారెంట్ పేరుతో పీఓఎస్ మిషిన్ కొనేందుకు ప్రయత్నించాడు. ఆ మిషన్ సాయంతో క్రెడిట్, డెబిట్ కార్డుల్లోని డబ్బులు కాజేద్దామని అనుకున్నాడు. అప్పటికే స్నేహితులు, బంధువులు చేసిన లావాదేవీలకు సంబంధించిన వివరాలను నవనీత్ సేకరించాడు. అయితే.. పీఓఎస్ మిషిన్ కోసం దరఖాస్తు చేసుకున్న రెస్టారెంట్‌కు డిసెంబర్ 26న బ్యాంకు ఉద్యోగి వెరిఫికేషన్ కోసం వెళ్లాడు. దాంతో నవనీత్ బండారం బయటపడింది.
రెస్టారెంట్ యజమాని వివేక్ ఫిర్యాదు చేయడంతో నవనీత్న బనాశంకరి పోలీసులు డిసెంబర్ 28న అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 110 చొప్పున క్రెడిట్, డెబిట్ కార్డులు, మూడు ల్యాప్‌టాప్‌లు, ఆరు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. 14 నకిలీ స్టాంపులు, పలు బ్యాంకులకు చెందిన పాస్ బుక్‌లు, చెక్ బుక్‌లు దొరికాయి. పోలీసుల విచారణలో సైబర్ నేరాలకు పాల్పడేందుకే పీఓఎస్ మిషన్ కొనుగోలు చేసేందుకు ప్రయత్నించానని నవనీత్ ఒప్పుకున్నాడు.