న్యూఢిల్లీ, డిసెంబర్ 17: అధిక లగేజీతో రైలు ప్రయాణం చేస్తున్నారా? అయితే ఇక నుంచి విమానాల్లో మాదిరిగా రైళ్లలోనూ అధిక లగేజీకి అదనపు చార్జీ చెల్లించాల్సిందే. నిర్దేశిత ఉచిత పరిమితిని దాటి అదనపు లగేజీతో వెళ్లే రైలు ప్రయాణికులు ఇక నుంచి చార్జీ చెల్లించాల్సిందేనని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. బుధవారం ఆయన లోక్‌సభలో మాట్లాడుతూ ఉచిత పరిమితిని మించి లగేజీతో వెళ్తే అదనంగా చార్జీ పడుతుందని తెలిపారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ.. రెండో తరగతిలో ప్రయాణించే ప్రయాణికుడు ఉచితంగా 35 కేజీలు, అదనపు రుసుం చెల్లించి 70 కేజీలు తీసుకెళ్లవచ్చునన్నారు.
అలాగే స్లీపర్ తరగతి ప్రయాణికులు ఉచితంగా 40 కేజీలు, రుసుం చెల్లించి 80 కేజీలు, ఏసీ త్రీ టైర్ ప్రయాణికులు ఉచితంగా, గరిష్ఠంగా 40 కేజీలు, మొదటి తరగతి, ఏసీ టూ టైర్ ప్రయాణికులు ఉచితంగా 50 కేజీలు, అదనపు రుసుంతో 100 కేజీలు, ఏసీ మొదటి తరగతి వారు ఉచితంగా 70, రుసుం చెల్లించి 150 కేజీలు తీసుకుని వెళ్లవచ్చునని ఆయన వివరించారు. గరిష్ఠ పరిమితిలో ఉచిత చార్జీ కూడా ఉంటుందన్నారు. అలాగే సూట్‌కేసులు, బాక్స్‌లు 100 cmx60cmx25cm గరిష్ఠ కొలతలకు లోబడి ఉండాలని, ఈ సైజును మించితే వాటిని ప్రయాణికులు బోగీలలో తీసుకురావడానికి అంగీకరించరని, వాటిని బ్రేక్ వ్యాన్/పార్సిల్ వ్యాన్‌లో బుక్ చేసుకోవాలని చెప్పారు. వీటికి కూడా గరిష్ఠ పరిమితి ఉంటుందన్నారు. వ్యాపార సంబంధ వస్తువులను వ్యక్తిగత లగేజీగా బుకింగ్‌కు, తమతో తీసుకురావడానికి అనుమతించరన్నారు.
‘ఐఆర్సీటీసీ-ఈ-వాలెట్’ నుంచి నగదు విత్‌డ్రాకు వీల్లేదు
ఇండియన్ రైల్వే క్యాటరింగ్, టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) ఈ-వాలెట్ ఖాతాలో డబ్బు జమచేసిన వారు దానిని టికెట్ బుకింగ్‌కు మాత్రమే ఉపయోగించగలరని కేంద్రం తాజాగా స్పష్టం చేసింది. ఆ ఖాతాలోని నగదును ఉపసంహరించుకునే అవకాశం లేదని, అయితే ఈ-వాలెట్ ఖాతాను పూర్తిగా మూసివేసిన తర్వాత బ్యాలెన్స్.. సదరు వినియోగదారుడి బ్యాంక్ ఖాతాకు బదిలీ అవుతుందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ లోక్‌సభలో వెల్లడించారు. ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు బుధవారం ఆయన రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. ‘ఈ-వాలెట్ ఖాతాలో నగదుపై వడ్డీ ప్రయోజనాలను కల్పించే ప్రతిపాదన ఏదైనా కేంద్రం చేసిందా?’ అంటూ ఎంపీ జనార్దన్ సింగ్ సిగ్రివాల్ అడిగిన ప్రశ్నకు రైల్వే మంత్రి పై సమాధానమిచ్చారు. అయితే ఐఆర్సీటీసీ ఈ-వాలెట్ అనేది వస్తువులు, సేవలను కొనుగోలు చేయడానికి వీలు కల్పించే ఖాతా మాత్రమేనని, ఇలాంటి ఖాతాల నుంచి నగదు ఉపసంహరణకు అనుమతి లేదని రైల్వే మంత్రి తెలిపారు.
10 గంటల ముందే చార్ట్ తయారీ
రైళ్ల ఫస్ట్ రిజర్వేషన్ చార్ట్‌ను తయారు చేసే సమయాన్ని భారతీయ రైల్వే సవరించింది. దీంతో 10 గంటల ముందు తమ టికెట్ రిజర్వేషన్ అయిందో, లేదో ప్రయాణికులు తెలుసుకోవచ్చు. గతంలో నాలుగు గంటల ముందు తయారు చేయటం వల్ల ప్రయాణికులు, ముఖ్యంగా వెయిటింగ్ లిస్ట్‌లోని వారు తీవ్ర ఆందోళనకు గురయ్యేవారు.
చార్ట్ తయారీ ఇలా..
ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలలోగా బయల్దేరే రైళ్లకు మొదటి రిజర్వేషన్ చార్ట్‌ను అంతకుముందు రోజు రాత్రి 8 గంటలకు సిద్ధం చేస్తారు. మధ్యాహ్నం 2.01 గంటల నుంచి అర్ధరాత్రి 11.59 గంటలలోగా, అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటలలోగా ప్రయాణించే రైళ్లకు ఫస్ట్ రిజర్వేషన్ చార్ట్‌ను సంబంధిత రైలు బయల్దేరడానికి 10 గంటల ముందు తయారు చేస్తారు.