హనుమాన్ చాలీసా పఠనం మహారాష్ట్రలో దుమ్ము దుమారమే రేపుతోంది. అధికార మహా వికాస్ అగాఢీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య రోజూ మాటల యుద్ధం నడుస్తోంది. మహావికాస్ అగాఢీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని బీజేపీ మండిపడుతుంటే, సీఎం ఇంటి ముందు హనుమాన్ చాలీసా పఠనం వెనుక కుట్రలున్నాయని శివసేన కౌంటర్ ఇస్తోంది.
ఇక… తాజాగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అధికార పక్షంపై తీవ్రంగా మండిపడ్డారు. హనుమాన్ చాలీసా చదవడమే దేశ ద్రోహమైతే, తనపై కూడా దేశద్రోహం మోపాలని సీఎం ఉద్ధవ్‌కు సవాల్ విసిరారు. రాజకీయ వైరి పక్షాలపై తప్పుడు కేసులు పెడుతున్నారని, పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి ఉద్ధవ్ అసహనశీలురు అంటూ అభివర్ణించారు. నవనీత్ రాణా దంపతులు సీఎం ఇంటి ముందు కేవలం హనుమాన్ చాలీసా పఠిస్తామని మాత్రమే అన్నారని, ఆందోళన నిర్వహిస్తామని ఎక్కడా చెప్పలేదన్నారు. ఇక్కడ హనుమాన్ చాలీసా పఠించకుంటే.. పాక్‌లో చదువుతామా? అంటూ ఫడ్నవీస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
లౌడ్ స్పీకర్ల నిషేధంపై అఖిలపక్ష భేటీపై కూడా ఫడ్నవీస్ స్పందించారు. ఇంతటి కీలక సమావేశానికి సీఎం ఉద్ధవ్ డుమ్మా కొట్టారని, అలాంటప్పుడు తాము వెళ్లి, ఏం చేయాలని సూటిగా ప్రశ్నించారు. సీఎం గైర్హాజర్ వల్లే తాము అఖిలపక్ష భేటీకి వెళ్లకూడదని నిర్ణయించినట్లు ఫడ్నవీస్ వెల్లడించారు.