చెన్నై: శ్రీలంకలో తమిళుల స్వేచ్ఛ కోసం పోరాడిన ఎల్టీటీఈ చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్ ఇంకా బతికే ఉన్నాడని ప్రపంచ తమిళ ఫెడరేషన్ అధ్యక్షుడు పజా నెడుమారెన్ చేసిన సంచలన ప్రకటనపై.. తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు కేఎస్ అళగిరి తనదైన శైలిలో స్పందించారు. ‘వేలుపిళ్లై ప్రభాకరన్ బతికే ఉన్నాడా..? అయితే చాలా సంతోషం. పజా నెడుమారెన్ నాకు ప్రభాకరన్‌ను చూపిస్తానంటే, నేను వెళ్లి అతడిని చూసొస్తా. ఆ విషయంలో నాకు ఎలాంటి సమస్య లేదు’ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
కాగా, వేలుపిళ్లై ప్రభాకరన్ బతికే ఉన్నాడని ఇవాళ ఉదయం ప్రపంచ తమిళ ఫెడరేషన్ అధ్యక్షుడు పజా నెడుమారెన్ ప్రకటించారు. ‘మన తమిళ జాతి నాయకుడు ప్రభాకరన్ బతికే ఉన్నాడని ప్రకటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అయన క్షేమంగా ఉన్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళ ప్రజలకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నందుకు నాకు ఆనందంగా ఉన్నది. దీంతో సుదీర్ఘ కాలంగా ప్రభాకరన్ మరణించాడని జరుగుతున్న ప్రచారానికి ఇకనైనా తెరపడుతుందని భావిస్తున్నా’ అని నెడుమారెన్ తన ప్రకటనలో పేర్కొన్నారు.
అంతేగాక, తమిళుల స్వాతంత్య్రం కోసం ప్రభాకరన్ ఒక ప్రకటన చేయబోతున్నారని కూడా నెడుమారెన్ చెప్పారు. ప్రపంచంలోని తమిళ ప్రజలంతా కలిసికట్టుగా ప్రభాకరన్‌కు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. దాంతో నెడుమారెన్ వ్యాఖ్యలపై కేఎస్ అళగిరి పైవిధంగా స్పందించారు. అయితే, వాస్తవానికి ప్రభాకరన్ 2010లో శ్రీలంక సైన్యం దాడిలో మరణించాడన్నదే ఇప్పటి వరకు ప్రపంచ ప్రజానీకానికి తెలిసిన నిజం.