చండీగఢ్: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కోట్లాది దేశ ప్రజల ఆశాకిరణమని ఆ పార్టీ నేత రాఘవ్ చద్దా తెలిపారు. తమ పార్టీ కాంగ్రెస్కు ప్రత్యామ్నాయమని చెప్పారు. దేవుడి దయ వల్ల ప్రజలు అవకాశం ఇస్తే కేజ్రీవాల్ ప్రధాన మంత్రి అవుతారని అన్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో ప్రధాన జాతీయ రాజకీయ శక్తిగా ఆప్ ఉంటుందన్నారు. పంజాబ్ ఎన్నికల సహ ఇన్ఛార్జ్ అయిన రాఘవ్ చద్దా, ఆ రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై బుధవారం స్పందించారు. గురువారం ఓట్ల లెక్కింపు నేపథ్యంలో పంజాబ్లోని పలు కౌంటింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా రాఘవ్ చద్దా మీడియాతో మాట్లాడారు. ఒక రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి బీజేపీకి పదేండ్లు పట్టిందని తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఏర్పడి పదేండ్లు కూడా కాలేదని, అయినప్పటికీ రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. జాతీయ రాజకీయ శక్తిగా ఆప్ ఆవిర్భవించిందని ఆయన చెప్పారు. తమ పార్టీ కాంగ్రెస్కు సహజ ప్రత్యామ్నాయమని అన్నారు. దేశ ప్రజల ఆశాకిరణం అరవింద్ కేజ్రీవాల్ అని, ఆయన తప్పకుండా ప్రధాన మంత్రి వంటి ఉన్నత హోదాలో కనిపిస్తారంటూ ఆశాభావం వ్యక్తం చేశారు.