తిరువనంతపురం: కేరళ సీఎం పినరయి విజయన్ (Pinarayi Vijayan) కాంగ్రెస్ పార్టీని ఘాటుగా విమర్శించారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే, ఆ తర్వాత బీజేపీతో జతకట్టవచ్చని అన్నారు. శనివారం తిరువనంతపురంలో ఎల్డీఎఫ్ ఎన్నికల ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేరళ మాజీ సీఎం కే కరుణాకరన్ కుమార్తె, కాంగ్రెస్ నాయకురాలు పద్మజా వేణుగోపాల్ బీజేపీలో చేరడాన్ని ఆయన ప్రస్తావించారు. ‘బీజేపీ గెలిస్తే ఆ పార్టీ అలాగే ఉంటుంది. అయితే కాంగ్రెస్ గెలిస్తే రేపు బీజేపీతో పొత్తు పెట్టుకోవచ్చు’ అని అన్నారు.
కాగా, కాంగ్రెస్కు ఇతర వర్గానికి తేడా ఏముందని సీఎం విజయన్ ప్రశ్నించారు. ‘కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? 11 మంది మాజీ కాంగ్రెస్ సీఎంలు ఇప్పుడు ఎటువైపు ఉన్నారు? వారు బీజేపీ నాయకత్వంతో ఉన్నారు. అశోక్ చవాన్, అమరీందర్ సింగ్, దిగంబర్ కామత్, ఎస్ఎం కృష్ణ, విజయ్ బహుగుణ, కిరణ్ కుమార్ రెడ్డి, ఎన్డీ తివారీ, జగదాంబిక పాల్, పెమా ఖండూ, నారాయణ్ రాణే, గిర్ధర్ గామాంగ్ బీజేపీలో చేరారు. ఇంకా ఎంతమంది చేరుతారో ఎవరూ ఊహించలేరు. ఇదీ కాంగ్రెస్ పరిస్థితి’ అని వ్యాఖ్యానించారు.
మరోవైపు, కేరళలో వన్యప్రాణుల దాడులకు సంబంధించి సమగ్ర పరిష్కారం కోసం వన్యప్రాణుల చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఉందని సీఎం విజయన్ తెలిపారు. వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ తన పార్లమెంట్ ప్రసంగంలో వన్యప్రాణుల దాడుల అంశాన్ని ఎప్పుడూ ప్రస్తావించలేదని విమర్శించారు.