న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన సేయిలింగ్ నౌక సీ ఏంజిల్.. అండమాన్ నికోబార్ దీవుల్లోని ఇందిరా పాయింట్‌కు సుమారు 52 నాటికల్ మైళ్ల వద్ద చిక్కుకుపోయింది. అయితే ఆ నౌకతో పాటు దాంట్లో ఉన్న ఇద్దరు సెయిలర్లను భారతీయ కోస్టుగార్డు(Indian Coast Guard) రక్షించింది. జూలై 10వ తేదీన ఈ ఘటన జరిగింది. ఇద్దరు సిబ్బందితో బయలుదేరిన అమెరికా పడవ.. నికోబార్ దీవుల వద్ద తీవ్ర ఒడిదిడుకులకు లోనైంది. చాలా ప్రతికూల వాతావరణం నేపథ్యంలో ఆ నౌక ఇందిరా పాయింట్ సమీపంలో చిక్కుకుపోయింది. అయితే సహాయం కోసం ఆ నౌక అలర్ట్ చేసింది.
ఎంఆర్సీసీ పోర్టుబ్లెయిర్ సమీపంలో ఉన్న నౌకలకు ఆ హెల్ప్ కాల్ గురించి అలర్ట్ చేసింది. ప్రోటోకాల్ ప్రకారం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. భారతీయ కోస్టుగార్డుకు చెందిన ఐసీజీ రాజ్వీర్ నౌకను సహాయం కోసం పంపారు. సముద్రంలో చిక్కుకున్న అమెరికా నౌకతో ఐసీజీ రాజ్వీర్ లింకు ఏర్పర్చుకున్నది. బలమైన గాలులు వీస్తున్నా.. సిబ్బంది సురక్షితంగా, ఆరోగ్యంగా ఉన్నట్లు గుర్తించారు. జూలై 11వ తేదీన ఆ నౌకను విజయవంతంగా క్యాంప్‌బెల్ బే హార్బర్‌కు తరలించారు.