న్యూఢిల్లీ: వివాదాస్పద ఐఏఎస్ ఆఫీసర్ పూజా ఖేద్కర్‌ను అరెస్టు చేయవద్దు అంటూ ఇవాళ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఢిల్లీ పోలీసులతో పాటు యూపీఎస్సీకి ఆ నోటీసులు జారీ చేసింది. ముందస్తు బెయిల్ కావాలంటూ పూజా ఖేద్కర్ పిటీషన్ పెట్టుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉన్న కారణంగా.. ఆమెను అరస్టు చేయరాదు అని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో అత్యవసర అరెస్టు అవసరం లేదని కోర్టు చెప్పింది. అయితే ఆగస్టు 21వ తేదీ వరకు ఆమెకు రక్షణ కల్పిస్తూ ఆదేశాలు ఇచ్చింది. అక్రమ రీతిలో ఓబీసీ, దివ్యాంగ కోటాను వాడుకున్నట్లు పూజా ఖేద్కర్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఢిల్లీ పోలీసులు, యూపీఎస్సీకి జస్టిస్ సుబ్రమణ్యం ప్రసాద్ నోటీసులు ఇచ్చారు. వచ్చే విచారణ తేదీ వరకు తమ క్లయింట్‌ను అరెస్టు చేయరాదు అని జస్టిస్ ప్రసాద్ తెలిపారు. ఆగస్టు 21వ తేదీన మళ్లీ ఈ కేసులో వాదనలు జరగనున్నాయి. రిజర్వేషన్ బెనిఫిట్ పొందేందుకు యూపీఎస్సీ సివిల్స్ పరీక్ష దరఖాస్తులో తప్పుడు సమాచారం ఇచ్చినట్లు ఖేద్కర్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఖేద్కర్ అభ్యర్థిత్వాన్ని జూలై 31వ తేదీన యూపీఎస్సీ రద్దు చేసింది. భవిష్యత్తులో పరీక్షలు రాయకుండా నిషేధించింది.