శ్రీనగర్: ఒక కేసులో పరిహారం చెల్లించాలన్న కోర్టు తీర్పును ఐఏఎస్ అధికారి లెక్కచేయలేదు. దీంతో ఆయన జీతాన్ని అటాచ్ చేయాలని న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. అయితే ఆ జడ్జిపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఐఏఎస్ అధికారి ప్రయత్నించారు. (IAS Officer Threatens Judge) న్యాయమూర్తి నివాసానికి అధికారులను పంపి ఆయనను బెదిరించడంతోపాటు వేధింపులకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో క్రిమినల్ ధిక్కారానికి పాల్పడిన ఐఏఎస్ అధికారికి హైకోర్టు సమన్లు జారీ చేసింది. జమ్ముకశ్మీర్‌లో ఈ సంఘటన జరిగింది. 2018 బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) అధికారి శ్యాంబీర్ సింగ్, 2022 నుంచి గందర్బాల్ జిల్లా కమిషనర్‌గా పని చేస్తున్నారు.
కాగా, ఒక కేసులో బాధిత పక్షానికి న్యాయస్థానం ద్వారా పరిహారం చెల్లించాలన్న 2022 అక్టోబరు నాటి కోర్టు డిక్రీని ఐఏఎస్ అధికారి శ్యాంబీర్ సింగ్ పాటించలేదు. దీంతో ఆయన జీతాన్ని అటాచ్ చేయాలని గందర్బాల్ జిల్లా కోర్టు జడ్జి ఫయాజ్ అహ్మద్ ఖురేషీ ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆ న్యాయమూర్తిపై ప్రతీకారం తీర్చుకునేందుకు డిప్యూటీ కమిషనర్ ప్రయత్నించారు. జడ్జి ఫయాజ్ను భయపెట్టేందుకు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ప్రభుత్వ అధికారులను న్యాయమూర్తి ఇంటికి పంపి వేధించినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి.
మరోవైపు జడ్జి ఫయాజ్ అహ్మద్ ఖురేషీ ఫిర్యాదును జమ్ముకశ్మీర్ హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. గందర్బాల్ జిల్లా కమిషనర్ శ్యాంబీర్ సింగ్‌కు సమన్లు జారీ చేసింది. ఆగస్ట్ 5న ఉదయం 11 గంటలకు కోర్టు ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని పేర్కొంది. ఆ ఐఏఎస్ అధికారిపై వచ్చిన క్రిమినల్ ధిక్కార ఆరోపణలపై వ్యక్తిగతంగా సమాధానం ఇవ్వాలని జస్టిస్ అతుల్ శ్రీధరన్, జస్టిస్ సంజీవ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. సమన్లు పట్టించుకోకపోయినా, కోర్టుకు హాజరుకాకపోయినా తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించింది. విచారణలో కోర్టుకు సహకరించేందుకు సీనియర్ న్యాయవాది రియాజ్ అహ్మద్ జాన్‌ను అమికస్ క్యూరీగా హైకోర్టు నియమించింది.