న్యూఢిల్లీ: సైనిక విన్యాసాల్లో అరుదైన ఘటన జరిగింది. భారత వైమానిక దళానికి చెందిన ఫైటర్ జెట్ సుఖోయ్-30 ఎంకేఐ, అమెరికా స్ట్రాటజిక్ బాంబర్ బీ-1 లాన్సర్.. సంయుక్తంగా సైనిక విన్యాసాల్లో పాల్గొన్నాయి. నవంబర్ 10 నుంచి 13వ తేదీ వరకు జరుగుతున్న నాలుగు రోజుల సైనిక డ్రిల్‌లో ఈ స్టంట్ జరిగింది. రష్యా తయారీ అయిన సుఖోయ్ ఫైటర్ విమానం గతంలో అమెరికా యుద్ధ విమానాల(Fighter Jets)తో కలిసి ఎగిరినా.. భారత్ వేదికగా జరుగుతున్న సైనిక విన్యాసాల్లో పాల్గొనడం ఇదే మొదటిసారి. ఆ విన్యాసాలకు చెందిన ఫోటోలను ఐఏఎఫ్ బుధవారం రిలీజ్ చేసింది. బీ-1 బాంబర్‌తో కలిసి సుఖోయ్30 ఎంకేఐతో పాటు మిరాజ్-2000 ఫైటర్ జెట్ కూడా విన్యాసాల్లో పాల్గొన్నది. ఈ సైనిక విన్యాసాల కోసం అమెరికా వైమానిక దళం కేవలం బీ-1 లాన్సర్ బాంబర్‌ను మాత్రమే పంపింది.
ఇటీవల అమెరికా, భారత్ మధ్య వాణిజ్య యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు దేశాలకు చెందిన యుద్ధ విమానాలు విన్యాసాల్లో పాల్గొనడం గమనార్హం. అమెరికా తన డీప్ స్ట్రయిక్ మిషన్స్ కోసం లాంగ్ రేంజ్ హెవీ బాంబర్ బీ-1 లాన్సర్‌ను వాడుతుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో బెంగుళూరులో జరిగిన ఏరో ఇండియా షోలో కూడా ఆ బాంబర్ పాల్గొన్నది. అయితే ఈ సారి ఐఏఎఫ్, యూఎస్ ఎయిర్ ఫోర్స్ సంయుక్తంగా విన్యాసాలు నిర్వహించడం రెండు దేశాల సహకారాన్ని ప్రస్పుటం చేస్తున్నది. భారత్ తమకు కీలక రక్షణ భాగస్వామి అని గతంలో అమెరికా పేర్కొన్న విషయం తెలిసిందే.
INDIA–US AIR EXERCISE
The Indian Air Force and United States Air Force are engaged in a bilateral exercise from 10–13 Nov 25, aimed at fostering mutual learning and enhancing interoperability.
USAF is participating with the B-1B Lancer.#IAF #USAF #Interoperability… pic.twitter.com/49z1jYsv91— Indian Air Force (@IAF_MCC) November 12, 2025