IAF induction | హైదరాబాద్ దుండిగల్‌లోని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఏఎఫ్) అకాడమీలో శనివారం పాసింగ్ ఔట్ పరేడ్ ఘనంగా జరిగింది. దీంతో భారత వైమానిక దళంలోకి కొత్త వైమానిక యోధులు వచ్చి చేరారు.ఈ కార్యక్రమానికి సమీక్ష అధికారిగా బంగ్లాదేశ్ ఎయిర్ చీఫ్ మార్షల్ షేక్ అబ్దుల్ హన్నన్ హాజరయ్యారు. గ్రాడ్యుయేషన్ పరేడ్‌ను విదేశీ సర్వీసు చీఫ్ సమీక్షించడం ఇదే తొలిసారి.
ఎయిర్‌ఫోర్స్ వివిధ శాఖలకు చెందిన ఫ్లయింగ్ క్యాడెట్ల ప్రీ-కమిషనింగ్ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్నందుకు గుర్తుగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఈ కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ నిర్వహించింది. ఈ వేడుకలో ఫ్లయింగ్, నావిగేషన్ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఫ్లయింగ్ క్యాడెట్లకు వింగ్స్‌ను అందజేశారు. మెరిట్ క్రమంలో నిలిచిన ఫ్లయింగ్ క్యాడెట్లకు ‘స్వర్డ్ ఆఫ్ హానర్’తో సత్కరించారు. బంగ్లాదేశ్ ఎయిర్ చీఫ్ మార్షల్ షేక్ అబ్దుల్ హన్నన్‌తో పాటు బంగ్లాదేశ్ నుంచి పలువురు ప్రముఖులు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు.
నిజానికి, గత నెలలోనే ఎయిర్ ఫోర్స్ స్టేషన్ తాంబరంలో మరొక జాయింట్ పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. ఇందులో వివిధ సాంకేతికతలకు చెందిన 841 మంది వైమానిక యోధులు, ఏడుగురు విదేశీ ట్రైనీలు తమ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఈ వైమానిక యోధులు మెకానికల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో 64 వారాల పాటు కఠినమైన, ఇంటెన్సివ్ శిక్షణ పొందారు. పరేడ్‌ను ఎయిర్ ఫోర్స్ స్టేషన్ తాంబరం ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఎయిర్ కమోడోర్ విపుల్ సింగ్ సమీక్షించారు.