బెంగళూరు: కర్ణాటక సీఎం అభ్యర్థి ఎంపికపై ( Chief Minister Tussle) కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాలు పడుతున్నది. అయితే సిద్ధరామయ్యను సీఎంగా పార్టీ అధిష్ఠానం ఖరారు చేసినట్లు తెలుస్తున్నది. పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ను డిప్యూటీ సీఎం చేయడంతోపాటు ఆయనకు కీలక శాఖలు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. అలాగే మొదటి రెండేళ్లు సిద్ధరామయ్య, ఆ తర్వాత మూడేళ్లు డీకే శివకుమార్‌కు సీఎం పగ్గాలు అప్పగించాలని భావిస్తున్నది. ఈ పరిణామాల నేపథ్యంలో డీకే శివకుమార్ ఢిల్లీ టూర్‌ను రద్దు చేసుకున్నారు. సోమవారం సాయంత్రం ఆయన ఢిల్లీ వెళ్లాల్సి ఉండగా యూటర్న్ తీసుకున్నారు. కడుపు నొప్పి వల్ల ఢిల్లీకి వెళ్లడం లేదన్నారు. అలాగే సీఎం పదవి చేపట్టనున్న సిద్ధరామయ్యను డీకే శివకుమార్ అభినందించారు. ‘ఆయనకు (సిద్ధరామయ్యకు) అభినందనలు, గుడ్ లక్’ అని అన్నారు.
కాగా, ఈ పరిణామాలకు ముందు డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడారు. తాను ఒంటరినని, రాష్ట్రంలో ఒంటరిగానే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నట్లు తెలిపారు. తన నేతృత్వంలోనే కాంగ్రెస్ పార్టీకి 135 సీట్లు దక్కాయని చెప్పారు. గతంలో 15 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడినా ధైర్యం కోల్పోకుండా పార్టీని తిరిగి బలోపేతం చేశానని అన్నారు. అయితే సీఎం పదవి విషయంలో పార్టీ హైకమాండ్ తగిన నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. అలాగే తన విషయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
మరోవైపు ఇప్పటికే ఢిల్లీలో ఉన్న సిద్ధరామయ్య, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేతో భేటీ అయ్యారు. తనకు మద్దతుగా ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు, వారి మనోభావాల గురించి ఆయనకు చెప్పినట్లు సమాచారం. అలాగే కేంద్ర పరిశీలకులు కూడా తమ నివేదికను ఆయనకు సమర్పించారు. దీంతో కాంగ్రెస్ అధిష్ఠానం సిద్ధరామయ్యను సీఎంగా ప్రకటించవచ్చని తెలుస్తున్నది.