వారణాసి: తమిళనాడు రాజకీయాల వల్లే తాను హిందీ భాష నేర్చుకోలేకపోయినట్లు కేంద్ర సమాచార, ప్రసార, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎల్ మురుగన్(Minister L Murugan) అన్నారు. ఢిల్లీకి వచ్చిన తర్వాత తాను హిందీ భాష నేర్చుకున్నట్లు చెప్పారు. హిందీ భాష నేర్చుకోవడం తన హక్కు అని ఆయన అన్నారు. వారణాసిలో జరిగిన కాశీ తమిళ సంఘం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కొత్త విద్యా విధానాన్ని తీసుకువచ్చినట్లు చెప్పారు. కానీ తమిళనాడులో ఉన్న రాజకీయాల వల్ల తాను హిందీ భాష నేర్చుకోలేకపోయినట్లు తెలిపారు. ఢిల్లీకి వచ్చిన తర్వాతే హిందీ నేర్చుకున్నానని, ఏమైనా తప్పులు ఉంటే, తనను క్షమించాలని, ఈ వేదికగా రాజకీయాలు మాట్లాడలేనన్నారు.
హిందీ భాషను నేర్చుకునే అవకాశాన్ని ఎందుకు దూరం చేసుకోవాలని, హిందీ నేర్చుకుంటానని, ఇది తన హక్కు అని, కానీ తమిళనాడులో ఆ భాష నేర్చుకునే అవకాశం లేదన్నారు. కొత్త జాతీయ విద్యా విధానం కింద ప్రవేశపెట్టిన త్రిభాషా విధానాన్ని తమిళనాడు సర్కారు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.