న్యూఢిల్లీ: తన తల మీద కాకి తన్నిన ఘటన గురించి పార్లమెంటులో ఎగతాళిగా మాట్లాడిన కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్‌కు ఆప్ ఎంపీ రాఘవ్చద్దా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘నన్ను ఓ కాకి తన్నింది, మీ అరుపు అచ్చం దాని లాగే ఉంది’ అని ఇన్‌స్టాలో వ్యాఖ్యానించారు. దాంతో చద్దా ఇన్‌స్టా పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాల్లోకి వెళ్తే రెండు రోజుల క్రితం పార్లమెంటు ఆవరణలో ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా తలపై కాకి తన్నింది. ఆ సమయంలో కొన్ని క్షణాలపాటు ఆయన కంగారుపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో బీజేపీ నేతలు రాఘవ్ చద్దాపై ఎగతాళి కామెంట్స్ చేస్తున్నారు. అబద్దాలు చెబితే కాకులు తంతాయంటూ వెక్కిరిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రమంత్రి పీయూష్ గోయెల్ కూడా చద్దాను కాకి తన్నిన ఘటన గురించి రాజ్యసభలో ఎగతాళిగా మాట్లాడారు.
‘వారి (చద్దా) మాటలకు కాకులు కూడా ఎట్రాక్ట్ అవుతున్నాయి’ అని గోయెల్ రాజ్యసభలో వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యంగ్య వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్‌ను చద్దా ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ‘నన్ను ఓ కాకి తన్నింది, దాని అరుపు అచ్చం మీ లాగే ఉంది’ అంటూ ఆ వీడియో క్లిప్పింగ్‌కు క్యాప్షన్ జత చేస్తూ చద్దా కౌంటరిచ్చారు. ప్రస్తుతం ఈ కౌంటర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.