చండీగఢ్: పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ పదవికి నవ్‌జ్యోత్ సింగ్ సిద్దూ రాజీనామా చేయడంపై స్పందించారు ఆ రాష్ట్ర మాజీ సీఎం అమరీందర్ సింగ్. సిద్దూ రాజీనామా లేఖను సోనియాకు పంపిన వెంటనే.. అమరీందర్ దీనిపై ట్వీట్ చేశారు. నేను ముందే చెప్పాను. ఆయన ఓ నిలకడ లేని వ్యక్తి. పంజాబ్‌లాంటి సరిహద్దు రాష్ట్రానికి పనికి రాడు అని అమరీందర్ ఆ ట్వీట్లో అన్నారు. ఈ ఏడాది జులైలోనే పంజాబ్ పీసీసీ చీఫ్ పదవి చేపట్టిన సిద్దూ.. రెండు నెలల వ్యవధిలోనే ఆ పదవిని వదులుకోవడం గమనార్హం. రాష్ట్ర భవిష్యత్తులో రాజీ పడబోనని సోనియాకు రాసిన లేఖలో సిద్దూ అన్నారు. పీసీసీ చీఫ్ పదవి నుంచి తప్పుకున్నా.. పార్టీలో కొనసాగుతానని ఆయన చెప్పారు.
ఓవైపు అమరీందర్ ఢిల్లీలో అమిత్ షా, జేపీ నడ్డాలను కలిసి బీజేపీలో చేరబోతున్నారని, కేంద్ర మంత్రి పదవి ఆయనను వరించబోతోందన్న వార్తల నేపథ్యంలో సిద్దూ తన పదవికి రాజీనామా చేయడం గమనార్హం. సిద్దూతో పడకనే అమరీందర్ పంజాబ్ సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అమరీందర్ తర్వాత దళిత సిక్కు అయిన చరణ్‌జిత్ సింగ్ చన్నీని కాంగ్రెస్ అధిష్టానం పంజాబ్ ముఖ్యమంత్రిని చేసింది.
I told you so…he is not a stable man and not fit for the border state of punjab.
— Capt.Amarinder Singh (@capt_amarinder) September 28, 2021