న్యూఢిల్లీ: ఢిల్లీలో స్కూటీపై వెళ్తున్న అంజలి అనే యువతిని కారుతో ఢీకొట్టి 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లి చంపిన ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్నది. స్కూటీని కారు ఢీకొట్టిన సమయంలో ఆ స్కూటీపై అంజలితోపాటు ఆమె స్నేహితురాలు నిధి కూడా ఉన్నదని గుర్తించిన పోలీసులు.. ఇవాళ ట్రేస్ చేసి పట్టుకున్నారు. అనంతరం నిధిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి ప్రశ్నించారు.
అనంతరం బయటికి వచ్చిన నిధి మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. అంజలి, తాను స్కూటీపై వెళ్తుండగా సుల్తాన్‌పురిలో కారు తమను బలంగా ఢీకొట్టిందని చెప్పింది. కారు ఢీకొట్టగానే తాను స్కూటీపై నుంచి ఎగిరిపడ్డానని, అంజలి కాలు కారు కింద ఇరుక్కపోవడంతో ఘోరం జరిగిందని తెలిపింది. అయితే, అంజలి కారు కింద ఇరుక్కుందని తెలిసి కూడా నిందితులు కారు ఆపలేదని పేర్కొంది.
స్నేహితురాలు అంత ప్రమాదంలో ఉంటే వదిలి ఎలా వెళ్లిపోగలిగారు అని మీడియా అడుగగా.. అంజలి కారు కింద ఇరుక్కుందని తెలిసి నిందితులు కారును వెనుకకు, ముందుకు పోనిచ్చారని, అలాచేస్తే అంజలి కారు నుంచి విడిపోతుందని భావించి ఉంటారని, కానీ అలా జరగకపోవడంతో కారును స్పీడ్‌గా తీసుకెళ్లారని చెప్పింది. ఆ ఘటనను ప్రత్యక్షంగా చూసేసరికి తనకు భయమేసిందని, అందుకే ఇంటికి వెళ్లిపోయానని తెలిపింది.