డెహ్రాడూన్: దేశంలో ద్రవ్యోల్బణం భారీగా ఉన్నప్పటికీ ప్రజలు బీజేపీకి జై అంటున్నారని, ఇది ఎందుకో తనకు అర్ధం కావడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత, ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీశ్ రావత్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కువాల్ స్థానం నుంచి పోటీ చేసిన ఆయన బీజేపీ అభ్యర్థి మోహన్ సింగ్ బిస్తీ చేతిలో సుమారు 14 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ నేపథ్యంలో తన పరాజయంతోపాటు కాంగ్రెస్ పార్టీ ఓటమిపై హరీశ్ రావత్ స్పందించారు. తమ ప్రయత్నాల్లో లోపాలు ఓటమికి కారణం కావచ్చని అన్నారు. మార్పు కోసం ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తారని నమ్మినట్లు చెప్పారు. అయితే తమ ప్రచార వ్యూహాలు సరిపోలేదని అభిప్రాయపడ్డారు.
కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుపై ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీశ్ రావత్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘ఇంత భారీ ద్రవ్యోల్బణం తర్వాత, ప్రజా తీర్పు ఇదేనా? ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయానికి నిర్వచనం ఏమిటి? ‘బీజేపీకి జిందాబాద్’ అని ప్రజలు అనడాన్ని నేను అర్థం చేసుకోలేకపోతున్నా’ అని వ్యాఖ్యానించారు. అయితే పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తానని అన్నారు.