బెంగళూరు: తాను ఇప్పటికీ బీజేపీతోనే ఉన్నానని కర్ణాటకకు చెందిన బహిష్కృత నేత కేఎస్ ఈశ్వరప్ప (KS Eshwarappa) తెలిపారు. సోమవారం శివమొగ్గలో మీడియాతో ఆయన మాట్లాడారు. మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప, ఆయన కుమారుడిపై మండిపడ్డారు. ‘రాష్ట్ర బీజేపీ పగ్గాలు తండ్రీకొడుకుల వద్ద ఉండటం తప్పు. హిందూ కార్యకర్తలు, హిందుత్వవాదులకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో లోక్‌సభ ఎన్నికల్లో నేను పోటీ చేశా’ అని అన్నారు. రాయన్న బ్రిగేడ్‌ను నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు. అయితే దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు.
కాగా, పార్లమెంట్లో హిందుత్వపై రాహుల్ గాంధీ చేసిన ప్రసంగాన్ని కేఎస్ ఈశ్వరప్ప విమర్శించారు. హిందూ సమాజాన్ని విమర్శించే సాహసం ఇంతకు ముందు ఎవరూ చేయలేదని తెలిపారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇప్పుడు హిందూ మతాన్ని టార్గెట్ చేస్తున్నారని అన్నారు. రాహుల్ గాంధీ గౌరవప్రదంగా వ్యవహరించాలని, లేకపోతే మొత్తం హిందూ సమాజం ఆయనకు వ్యతిరేకంగా మారుతుందని హెచ్చరించారు.
మరోవైపు లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్ యడ్యూరప్ప కుమారుడు బీవై రాఘవేంద్రపై స్వతంత్ర అభ్యర్థిగా
కేఎస్ ఈశ్వరప్ప పోటీ చేశారు. ఆయన 30,050 ఓట్లు సాధించగా, 2.43 లక్షల ఓట్ల తేడాతో రాఘవేంద్ర విజయం సాధించారు. అయితే ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన ఈశ్వరప్పను పార్టీ నుంచి బీజేపీ బహిష్కరించింది.