PM Modi | న్యూఢిల్లీ, జనవరి 10: తానూ మనిషినేనని.. దేవుడిని కాదని, పొరపాట్లు చేసి ఉండొచ్చు కానీ దురుద్దేశంతో మాత్రం తప్పులు చేయనని ప్రధాని మోదీ పేర్కొన్నారు. జెరోడా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్‌తో మోదీ మొదటి పాడ్‌కాస్ట్ శుక్రవారం విడుదలైంది. ఇందులో తన బాల్యం, రాజకీయ జీవితం, అనుభవాల గురించి మోదీ మాట్లాడారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా గతంలో తాను చేసిన వ్యాఖ్యల గురించి మోదీ స్పందిస్తూ.. ‘నేను సున్నితంగా మాట్లాడలేదు. తప్పులు జరుగుతాయి. నేనూ మనిషినే, దేవుడిని కాదు’ అని అన్నారు. గోద్రా ఘటనలో మృతదేహాలు చూసి చాలా భావోద్వేగానికి గురయ్యానని, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నందుకు అదుపు చేసుకున్నట్టు చెప్పారు. తనకు అమెరికా వీసా ఇచ్చేందుకు నిరాకరించడం దేశానికి, ఎన్నికైన ప్రభుత్వానికి అవమానంగా భావించానని గుర్తుచేసుకున్నారు.
ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలపై స్పందిస్తూ.. ‘మనలో ద్వంద్వ నీతి లేనందున ప్రపంచం మనల్ని విశ్వసిస్తోంది. శాంతి వైపు, తటస్థంగా మేము ఉంటామనే మాట రష్యా, ఉక్రెయిన్, ఇరాన్, పాలస్తీనా, ఇజ్రాయెల్‌లో చెప్పాను. వారికి నాపై నమ్మకం ఉంది.’ అని వ్యాఖ్యానించారు. గాంధీ, సావర్కర్ గురించి మాట్లాడుతూ.. వారిద్దరి దారులు వేరైనా, భావజాలం మాత్రం స్వాతంత్య్రాన్ని సాధించడమేనని చెప్పారు. ‘దేశమే ప్రధానం’ అనేదే రాజకీయాల్లో తన భావజాలమని తెలిపారు.
తానేప్పుడూ కంఫర్ట్ జోన్లో జీవించలేదని, ప్రమాదాన్ని ఎదుర్కొనే సామర్థ్యం తనలో ఎక్కువ ఉంటుందని, ఇంతవరకు దానిని పూర్తిగా వినియోగించలేదని చెప్పారు. చిన్నప్పుడు తాను సాధారణ విద్యార్థినేనని, పరీక్షలంటే పారిపోయే వాడినని, ఎలాగోలా పాస్ అయ్యేవాడినని చెప్పారు. యుక్త వయసులోనే ఇల్లు వదిలేశానని, తన వారందరితోనూ సంబంధాలు కోల్పోయానన్నారు.