శనివారం 28 నవంబర్ 2020
National - Nov 19, 2020 , 15:29:42

మూడు నాలుగు నెల‌ల్లో క‌రోనా వ్యాక్సిన్‌: ఆరోగ్య‌మంత్రి హ‌ర్ష‌వ‌ర్ద‌న్

మూడు నాలుగు నెల‌ల్లో క‌రోనా వ్యాక్సిన్‌: ఆరోగ్య‌మంత్రి హ‌ర్ష‌వ‌ర్ద‌న్

న్యూఢిల్లీ: ‌దేశంలో మ‌రో మూడునాలుగు నెల‌ల్లో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌స్తుంద‌న్న న‌మ్మ‌కం త‌న‌కు ఉన్న‌ద‌ని కేంద్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి హ‌ర్ష‌వ‌ర్ద‌న్ పేర్కొన్నారు. 'ది షిఫ్టింగ్ హెల్త్‌కేర్ పారాడిమ్ డ్యూరింగ్ అండ్ పోస్ట్ కొవిడ్' అనే అంశంపై జ‌రిగిన ఫిక్కీ ఎఫ్ఎల్‌వో వెబినార్‌లో హ‌ర్ష‌వర్ద‌న్ మాట్లాడారు. శాస్త్రీయ డాటా ఆధారంగా ఈ టీకా ప్రాధాన్య‌త నిర్ణ‌యించ‌బ‌డుతుంద‌ని మంత్రి పేర్కొన్నారు.  

'రాబోయే మూడు నాలుగు నెలల్లో కరోనా వ్యాక్సిన్ సిద్ధమ‌వుతుంద‌న్న నమ్మకం త‌న‌కు ఉన్న‌ది. శాస్త్రీయ డాటా ఆధారంగా టీకాకు ప్రాధాన్యత రూపొందించబడుతుంది. ఆరోగ్య సంరక్షణ కార్మికులు, కరోనా యోధులకు సహజంగానే ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. ఆ త‌ర్వాత వ‌రుస‌లో వృద్ధులు, వివిధ వ్యాధుల బారిన‌ప‌డిన వారు ఉంటారు. వ్యాక్సిన్ పంపిణీ కోసం ఒక స‌మ‌గ్ర‌మైన ప్ర‌ణాళిక రూపొందించ‌బ‌డుతున్న‌ది' అని ఆరోగ్య‌మంత్రి హ‌ర్ష‌వ‌ర్ద‌న్ చెప్పారు. 

'వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించిన బ్లూప్రింట్‌పై చ‌ర్చించ‌డం కోసం ఈ-వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించబ‌డింది. ఒక్క‌సారి వ్యాక్సిన్ ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చిందంటే స‌మ‌స్య ప‌రిష్కారానికి మార్గం ఏర్ప‌డుతుంది. ఏదేమైనా 2021 సంవ‌త్స‌రం మనందరికీ మంచి జ‌రుగాల‌ని ఆశిద్దాం' అని హ‌ర్ష‌వ‌ర్ద‌న్ పేర్కొన్నారు. గ‌త కొన్ని నెలలుగా దేశంలో తిష్ట‌వేసిన క‌రోనా మహ‌మ్మారి క‌ట్ట‌డి కోసం కేంద్ర ప్ర‌భుత్వం ధైర్యంగా ఎన్నో చ‌ర్య‌లు చేప‌ట్టింద‌న్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.