G 20 Summit | న్యూఢిల్లీ : ఈ నెల 9, 10 తేదీల్లో జరిగిన జీ20 సదస్సుకు హాజరైన చైనా ప్రతినిధుల బ్యాగులు అనుమానాస్పదంగా కనిపించడంతో ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ హోటల్ వద్ద గురువారం హైడ్రామా జరిగినట్లు తెలుస్తున్నది. చైనా ప్రతినిధుల వద్ద ఉన్న ఓ బ్యాగు కొలతలు విభిన్నంగా ఉన్నప్పటికీ, దౌత్యపరమైన ప్రొటోకాల్స్‌కు అనుగుణంగా వాటిని ఆ హోటల్ సిబ్బంది అనుమతించారు.
అయితే చైనా ప్రతినిధులు హోటల్ గదుల్లోకి వెళ్లిన తర్వాత రెండు బ్యాగుల్లో అనుమానాస్పద పరికరాలు ఉన్నట్లు హోటల్ సిబ్బందిలో ఒకరు గుర్తించి, భద్రతా సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే అప్రమత్తమైన భద్రతాధికారులు ఆ బ్యాగులను స్కానర్‌లో పెట్టాలని వారిని కోరారు. కానీ చైనా ప్రతినిధులు అందుకు తిరస్కరించారు. 12 గంటలపాటు చర్చలు జరిగిన తర్వాత ఎట్టకేలకు చైనా ప్రతినిధులు ఆ బ్యాగులను ఎంబసీకి పంపించడానికి అంగీకరించడంతో హైడ్రామాకు తెరపడింది.